అదే మా ఓటమికి కారణమంటున్న రోహిత్.. 'కేఎల్ రాహుల్ అండ్ కో' కు జరిమానా..
Mumbai Indians captain Rohit Sharma rues batting failure against Lucknow Super Giants. ఈ ఏడాది ఐపీఎల్ లో రెండు పాయింట్లు సంపాదించడానికి ముంబై ఇండియన్స్ జట్టు
By Medi Samrat Published on 25 April 2022 10:48 AM ISTఈ ఏడాది ఐపీఎల్ లో రెండు పాయింట్లు సంపాదించడానికి ముంబై ఇండియన్స్ జట్టు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంది. ఒక్కరంటే ఒక్కరు కూడా మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడడం లేదు. ఆ జట్టు గత చరిత్ర ఘనమైన ఈ సీజన్ లో మాత్రం ఒక్క విజయాన్ని అందుకోడానికి చాలా కష్టాలే పడుతోంది. కొన్ని మ్యాచ్ లలో ప్రత్యర్థులు వన్ సైడ్ చేసినా.. ఇంకొన్ని మ్యాచ్ లను ముంబై ఇండియన్స్ వదిలేశారు. ఇలా సాగుతూ ఉంది ఈ సీజన్ రోహిత్ శర్మ అండ్ కో కు..! ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 36 పరుగుల తేడాతో ముంబై జట్టు లక్నో చేతిలో ఓటమి పాలైంది. దీంతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి ముంబై నిష్క్రమించినట్లయింది.
మ్యాచ్ అనంతరం ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. తాము ఆడిన నిర్లక్ష్యపు షాట్లు మ్యాచ్ ఓడిపోయేలా చేశాయని విచారం వ్యక్తం చేశాడు. బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్ పై మా బౌలర్లు మెరుగ్గా రాణించారని అన్నాడు. ప్రత్యర్థి విధించిన లక్ష్యం మరీ అంత పెద్దదేమీ కాదని.. భాగస్వామ్యాలు నెలకొల్పడంలో మేము విఫలమయ్యామన్నాడు రోహిత్. నాతో సహా కొంత మంది బ్యాటర్ల నిర్లక్ష్యపు షాట్లు మా విజయావకాశాలను దెబ్బతీశాయని అన్నారు. ముఖ్యంగా మిడిలార్డర్ బ్యాటర్లు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరికి తమను తాము నిరూపించుకునే అవకాశం ఇవ్వాలని నేను భావిస్తాను అని చెబుతూ.. రాబోయే మ్యాచ్ లలో ఇతర ఆటగాళ్లకు అవకాశం ఇవ్వబోతున్నట్లు హింట్స్ ఇచ్చాడు రోహిత్.
లక్నో జట్టుకు ఐపీఎల్ రిఫరీ ఫైన్ తో షాకిచ్చారు. లక్నో జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ కు రూ.24 లక్షల ఫైన్ విధించారు. నిర్ణీత సమయంలోపు 20 ఓవర్ల బౌలింగ్ ను లక్నో జట్టు పూర్తి చేయలేకపోయింది. ఫలితంగా స్లో ఓవర్ రేటు కారణాన్ని చూపించి ఫైన్ విధించారు. ఈ సీజన్ లో లక్నో జట్టుకు ఇది రెండో విడత స్లో ఓవర్ రేటు. మ్యాచ్ లో పాల్గొన్న లక్నో జట్టు మిగిలిన సభ్యులు అందరికీ మ్యాచ్ ఫీజులో 25 శాతం లేదా రూ.6 లక్షలు చెల్లించాలని రిఫరీ ఆదేశాలు జారీ చేశారు. స్లో ఓవర్ రేటు నిబంధనల మేరకు ఫీల్డింగ్ చేస్తున్న జట్టు చివరి ఓవర్ (20వ ఓవర్)ను 85వ నిమిషం ముగిసేలోపు తప్పనిసరిగా ప్రారంభించాలి.