మార్చి 2023లో జరగనున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) ప్రారంభ ఎడిషన్ కోసం ముంబై ఇండియన్స్ ఆదివారం తన కోచింగ్ సిబ్బందిని ప్రకటించింది. మాజీ ఇంగ్లండ్ ఉమెన్స్ టీమ్ కెప్టెన్ షార్లెట్ ఎడ్వర్డ్స్ ప్రధాన కోచ్ పాత్రను పోషించనుంది. పద్మశ్రీ, అర్జున అవార్డు గ్రహీత ఝులన్ గోస్వామి జట్టు మెంటార్, బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆల్‌రౌండర్ దేవికా పల్షికార్ బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరించనున్నారు. తృప్తి చంద్‌గడ్కర్ భట్టాచార్య టీమ్ మేనేజర్‌గా వ్యవహరిస్తారు.
నీతా అంబానీ ముంబై ఇండియన్స్ ఫ్యామిలీ లోకి షార్లెట్ ఎడ్వర్డ్స్, ఝులన్ గోస్వామి, దేవికా పల్షికార్‌లను స్వాగతించారు. క్రీడాకారులుగా మాత్రమే కాకుండా కోచ్‌లుగా కూడా రాణిస్తున్న మహిళలను చూడటం అద్భుతంగా ఉంది. భారతదేశంలో మహిళల క్రీడకు ఇది ఉత్తేజకరమైన సమయం. అంతర్జాతీయ వేదికపై మన మహిళా అథ్లెట్లు దేశం గర్వించేలా చేశారు! మరింత ఉన్నత స్థాయికి చేరుకోవడానికి మేము వారికి అన్ని విధాలుగా మద్దతు ఇవ్వడానికి కట్టుబడి ఉన్నామని నీతా అంబానీ చెప్పుకొచ్చారు.
కొత్త కోచింగ్ టీమ్ గురించి నీతా అంబానీ మాట్లాడుతూ, "షార్లెట్ అద్భుతమైన నాయకత్వంలో, మా బౌలింగ్ కోచ్, మెంటార్ ఝులన్, మా బ్యాటింగ్ కోచ్ దేవికా సమర్ధవంతమైన మద్దతుతో, మా మహిళల జట్టు ముంబై ఇండియన్స్ పేరును మరింత ముందుకు తీసుకువెళుతుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఈ ఉత్తేజకరమైన ప్రయాణంలో మా కోచ్‌లు, మొత్తం జట్టుతో కలిసి పనిచేయడానికి నేను ఎదురుచూస్తున్నాను." అని అన్నారు.