దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కొద్ది రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. సామాన్యులు, సెలబ్రెటీలు అన్న తేడాలేకుండా అందరూ ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇటీవలే క్రికెట్ దిగ్గజం సచిన్ ఈ మహమ్మారి బారిన పడి కోలుకోగా.. తాజాగా టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ అని తేలింది. ధోని తల్లి దేవకి, తండ్రి పాన్‌సింగ్ కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం వీరిద్దరు రాంచీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతన్నారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు.
కాగా.. ధోని ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్( ఐపీఎల్)లో ఆడుతున్న సంగతి తెలిసిందే. ధోని సారథ్యంలోని చెన్నై జట్టు మూడు మ్యాచులు ఆడగా.. రెండింటిలో గెలిచి ఓ మ్యాచ్‌లో ఓడింది. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతున్న ఆ జట్టు నేడు కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి పాయింట్ల పట్టికలో మరింత ముందుకు వెళ్లాలని ధోని సేన గట్టి పట్టుదలతో ఉంది. ఐపీఎల్ 2020 సీజన్ అనంతరం ఆటకు దూరమైన మహీ.. పూర్తిగా కుటుంబంతో గడిపాడు. ట్రైనింగ్ క్యాంప్‌లో భాగంగా మార్చిలోనే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో కలిసాడు. అనంతరం చెన్నై జట్టు ముంబైకి చేరుకోగా.. బీసీసీఐ నిబంధనల ప్రకారం ఏడు రోజుల క్వారంటైన్‌లో ఉన్నాడు. ఇక దేశంలో కరోనా కేసులు పెరుగుతుండగా.. ఐపీఎల్ ఫ్రాంచైజీలన్నీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాయి.