ఎక్కడ చూసినా జడేజానే.. 2013లో ధోని చేసిన ట్వీట్ మరోసారి వైరల్
MS Dhoni's Eight-Year-Old Tweet Re-Emerges. చెన్నై సూపర్ కింగ్స్
By Medi Samrat Published on 20 April 2021 2:23 PM ISTచెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ సీజన్ లో దూకుడైన ఆటతీరును కనబరుస్తూ ఉంది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 45 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ 10, డుప్లెసిస్ 33, మొయీన్ అలీ 26, రైనా 18, రాయుడు 17, రవీంద్ర జడేజా 8, కెప్టెన్ ధోనీ 18, శామ్ కరణ్ 13 పరుగులు చేయగా, బ్రేవో 20 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. రాజస్థాన్ బౌలర్లలో చేతన్ సకారియా 3 వికెట్లు తీసుకోగా, క్రిస్ మోరిస్ 2, ముస్తాఫిజుర్, రాహుల్ తెవాటియా చెరో వికెట్ తీసుకున్నారు. 189 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 143 పరుగులు మాత్రమే చేసి పరాజయం పాలైంది. జోస్ బట్లర్ (49), రాహుల్ తెవాటియా (20), జయదేవ్ ఉనద్కత్ (24) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ ఆటతీరు కనబర్చలేకపోయారు. మొయీన్ అలీ 3 వికెట్లు పడగొట్టగా శామ్ కరణ్, రవీంద్ర జడేజా చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. శార్దూల్ ఠాకూర్, బ్రావో చెరో వికెట్ పడగొట్టారు.
Sir jadeja doesn't run to take the catch but the ball finds him and lands on his hand
— Mahendra Singh Dhoni (@msdhoni) April 9, 2013
రవీంద్ర జడేజా ఫీల్డింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతడి ఫీల్డింగ్ అద్భుతమని ఇప్పటికే చాలా సార్లు రుజువైంది. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో బౌలింగ్ లో రెండు వికెట్లు తీసిన జడ్డూ. క్యాచ్ ల విషయంలో కూడా దూకుడు ప్రదర్శించాడు. ఏకంగా నాలుగు క్యాచ్ లను జడేజా పట్టుకున్నాడు ఈ మ్యాచ్ లో..! మనన్ వోహ్రా, రియాన్ పరాగ్, క్రిస్ మోరిస్, ఉనాద్కత్ ల క్యాచ్ లను జడేజా ఒడిసిపట్టుకున్నాడు. దీంతో జడేజా మీద ప్రశంసల వర్షం కురిసింది. అయితే 2013లో మహేంద్ర సింగ్ ధోని జడేజా మీద చేసిన ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 'Sir jadeja doesn't run to take the catch but the ball finds him and lands on his hand' అంటూ మహీ అప్పట్లో ట్వీట్ చేశాడు. 'సర్ జడేజా క్యాచ్ కోసం పరిగెత్తాల్సిన అవసరం లేదు.. బంతే అతడిని వెతుక్కుంటూ వచ్చి చేతుల్లో పడుతుంది' అన్నది ట్వీట్ సారాంశం. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో అదే జరిగింది కూడానూ..!