ఉత్కంఠ పోరులో చెన్నై గెలుపు.. ఆఖ‌రి బంతికి విజ‌యం.. ముంబైకి ఏడో ఓటమి

MS Dhoni wins thriller for Chennai Super Kings.ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్‌)లో ఐదు సార్లు ఛాంపియ‌న్ అయిన

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 April 2022 10:29 AM IST
ఉత్కంఠ పోరులో చెన్నై గెలుపు.. ఆఖ‌రి బంతికి విజ‌యం.. ముంబైకి ఏడో ఓటమి

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్‌)లో ఐదు సార్లు ఛాంపియ‌న్ అయిన ముంబై ఇండియ‌న్స్ ప్ర‌స్తుత సీజ‌న్ లో బోణీ కొట్టేందుకు అష్ట‌క‌ష్టాలు పడుతోంది. చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఇక గెలుపు ద‌క్కిన‌ట్లే అనుకుంటున్న స‌మ‌యంలో మ‌హేంద్రుడు విజృంభించాడు. దీంతో ముంబైకి మ‌రో ప‌రాభ‌వం త‌ప్ప‌లేదు. ఈ సీజ‌న్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 7 మ్యాచులు ఆడిన ముంబై అన్నింటిలో ఓటమిపాలైంది. ఈ క్ర‌మంలో ఓ చెత్త రికార్డును త‌న ఖాతాలో వేసుకుంది. ఐపీఎల్ చ‌రిత్ర‌లో ఆరంభ మ్యాచుల్లో వ‌రుస‌గా ఏడు మ్యాచుల్లో ఓట‌మిపాలైన తొలి జ‌ట్టుగా నిలిచింది. ఈ ఓట‌మితో ముంబై జ‌ట్టు ఈ సీజన్ లో దాదాపుగా ప్లే ఆఫ్స్ కు చేర‌డం క‌ష్ట‌మే.

టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ముంబై జ‌ట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. హైద‌రాబాద్ కుర్రాడు తిలక్‌ వర్మ (51 నాటౌట్‌; 43 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోర‌ర్‌. సూర్యకుమార్‌ యాదవ్‌ (32; 3 ఫోర్లు, ఒక సిక్సర్‌), అరంగేట్ర ఆటగాడు హృతిక్‌ షోకీన్‌ (25) ఫ‌ర్వాలేద‌నిపించ‌గా..రోహిత్‌ శర్మ (0), ఇషాన్‌ కిషన్‌ (0), బ్రేవిస్‌ (4), పొలార్డ్‌(14) లు దారుణంగా విఫ‌లం అయ్యారు. ఓ ద‌శలో ముంబై 47 ప‌రుగుల‌కే నాలుగు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డినా.. తిల‌క్ వ‌ర్మ రాణించ‌డంతో గౌర‌వ‌ప్ర‌ద‌మైన స్కోర్ సాధించింది. చెన్నై బౌల‌ర్ల‌లో ముకేశ్ చౌద‌రి మూడు, బ్రావో రెండు, తీక్ష‌ణ‌, సాంట్న‌ర్ చెరో వికెట్ ప‌డ‌గొట్టారు.

అనంతరం.. మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోని( 28 నాటౌట్‌; 13 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్‌) తో పాటు అంబ‌టి రాయుడు (40; 35 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు), రాబిన్‌ ఊతప్ప (30; 25 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించ‌డంతో చెన్నై ల‌క్ష్యాన్ని 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి అందుకుంది.

ఆఖ‌రి ఓవ‌ర్‌లో 17 ప‌రుగులు

చెన్నై జ‌ట్టు గెల‌వాలంటే ఆఖ‌రి ఓవ‌ర్‌లో 17 ప‌రుగులు అవ‌స‌రం. ఉనద్క‌త్ బౌలింగ్‌లో తొలి బంతికి ప్రిటోరియ‌స్ ఔట్ కావ‌డంతో మ్యాచ్ ముంబై వైపు ఉన్న‌ట్లు క‌నిపించింది. రెండో బంతికి బ్రావో సింగిల్ తీయ‌డంతో విజ‌య స‌మీకర‌ణం నాలుగు బంతుల్లో 16 గా మారింది. ఈ స్థితిలో ధోని చెల‌రేగిపోయాడు. మునుప‌టి ధోని ని గుర్తు చేస్తూ.. అంద‌రూ త‌న‌ను ఎందుకు అద్భుత ఫినిష‌ర్ అని త‌న‌ను అంటారో మ‌రోసారి నిరూపించాడు. వ‌రుస‌గా 6,4 బాదాడు. దీంతో స‌మీక‌ర‌ణం 2 బంతుల్లో 6గా మారింది. ఐదో బంతికి రెండు ప‌రుగులు తీసిన మ‌హేంద్రుడు ఆఖ‌రి బంతిని బౌండ‌రీకి పంపి చెన్నైకి అద్భుత విజ‌యాన్ని అందించాడు. కాగా.. ఈ సీజ‌న్‌లో చెన్నై జ‌ట్టుకి ఇది రెండో గెలుపు. చెన్నై బౌల‌ర్ ముఖేశ్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డు దక్కింది.

Next Story