బెంగళూరు vs చెన్నై.. ధోనీ, విరాట్‌ను ఊరిస్తున్న రికార్డులు ఇవే
MS Dhoni set to play his 200th match for CSK in IPL.ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2022 సీజన్‌లో భాగంగా నేడు
By తోట వంశీ కుమార్ Published on 4 May 2022 1:47 PM ISTఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2022 సీజన్‌లో భాగంగా నేడు మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్దమైంది. పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో సాయంత్రం 7.30గంటలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ఇక ఈ మ్యాచ్‌లో అటు విరాట్ కోహ్లీని, ఇటు ధోనిని పలు రికార్డులు ఊరిస్తున్నాయి. మరీ ఈ మ్యాచ్‌లో ఆయా రికార్డులను వారు అందుకుంటారో లేదో చూడాలి
చెన్నైపై 1000 పరుగులు
ఈ మ్యాచ్ లో కోహ్లీ 51 పరుగులు చేస్తే చెన్నై సూపర్ కింగ్స్‌పై 1000 పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ అరుదైన ఘనత అందుకోనున్నాడు. ఒకవేళ ఈ మ్యాచ్‌లో విరాట్ ఆ ఘనత అందుకోకుంటే.. వచ్చే ఏడాది ఐపీఎల్ వరకు ఆగక తప్పదు. ఎందుకంటే.. ఈ సీజన్‌లో ఇరు జట్ల మధ్య లీగ్ దశలో ఇదే ఆఖరి మ్యాచ్. ప్రస్తుత పరిస్థితి చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్‌కు చేరడం కష్టం కావడమే అందుకు కారణం.
ధోని ని ఊరిస్తున్న రికార్డులు ఇవే..
- టీ20 మెగా టోర్నీ లో ధోనీకి ఇది 200వ మ్యాచ్. ఈ మెగా టోర్నీ చరిత్రలో ఒకే జట్టు తరుపున 200 మ్యాచులు ఆడుతున్న రెండో ఆటగాడిగా ధోని రికార్డులకు ఎక్కనున్నాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ తొలి స్థానంలో ఉన్నాడు. అతడు బెంగళూరు తరుపున ఇప్పటి వరకు 217 మ్యాచులు ఆడాడు.
- టీ20 (అన్నీ కలిపి) కెప్టెన్ గా ధోనీకిది 302వ మ్యాచ్. ఇప్పటిదాకా సారథిగా ధోనీ 5,994 రన్స్ చేశాడు. 6 వేల పరుగుల మైలురాయికి మరో 6 పరుగుల దూరంలో నిలిచాడు. ఇవాళ ఆ మార్కును అధిగమిస్తే భారత్ తరఫున ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా ధోనీ తన పేరును లిఖించుకోనున్నాడు.
-ఇక బెంగళూరుపై ధోనీ ఇప్పటివరకు 836 పరుగులు సాధించాడు. అందులో 46 సిక్సర్లున్నాయి. మరో 4 బాదితే.. బెంగళూరుపై సిక్సర్ల అర్ధశతకాన్ని పూర్తి చేసుకుంటాడు. తద్వారా ఒక జట్టుపై సిక్సర్ల అర్ధశతకం నమోదు చేసిన తొలి భారత ఆటగాడిగా ధోనీ రికార్డులకు ఎక్కుతాడు.