ఓటమిపై ధోని ఏమన్నాడంటే..?
MS Dhoni regrets poor batting after Chennai Super Kings lose in Pune.ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)2022 సీజన్‌లో
By తోట వంశీ కుమార్
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)2022 సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే ప్రతీ మ్యాచ్ ఖచ్చితంగా గెలవాల్సిన స్థితిలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిన్న(బుధవారం) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు చేతిలో ఓటమి పాలై అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో 13 పరుగుల తేడాతో చెన్నై ఓటమిని చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది.
బెంగళూరు బ్యాటర్లలో మహిపాల్ లామ్రోర్ (42; 27 బంతుల్లో 3ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్ డుప్లెసిస్ ( 38; 22 బంతుల్లో 4ఫోర్లు, సిక్స్) రాణించారు. చెన్నై బౌలర్లలో మహీశ్ తీక్షణ (3/27), మొయిన్ అలీ (2/28) సత్తా చాటారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 160 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్ డెవాన్ కాన్వె (56; 37 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), మొయిన్ అలీ (34; 27 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) పోరాటం సరిపోలేదు. హర్షల్ పటేల్ (3/35), మ్యాక్స్‌వెల్ (2/22) లు చెన్నైని దెబ్బకొట్టారు.
ఓటమి అనంతరం ధోని మాట్లాడుతూ.. బెంగళూరును 173 పరుగులకే కట్టడి చేశాం. అంతా సవ్యంగానే ఉంది. అయితే.. మా బ్యాట్స్‌మెన్ల తీరే నిరాశపరిచింది. ఛేదనలో ఎలా ఆడాలో తెలిసి ఉండాలి. ఆ సమయంలో స్వభావాన్ని కాస్త నియంత్రణలో పెట్టుకోవాలి. నీదైన శైలిలో షాట్లు ఆడకుండా పరిస్థితులు ఏం కోరుకుంటున్నాయో గమనించుకోవాలి. చేధనలో ఆరంభం చక్కగా ఉంది. చేతిలో వికెట్లు ఉన్నాయి. పిచ్ అనుకూలంగా మారుతోంది. అయినా స్వల్ప విరామంతోనే వికెట్లు నష్టపోయాం. మా బ్యాటర్లు కొన్ని షాట్ల ఎంపికలో ఫెయిల్ అయ్యారు. ఆ విషయంలో మరింత జాగ్రత్తపడాలి అని ధోనీ అన్నాడు.
చేధనలో ఓ దశలో చెన్నై 6.3 ఓవర్లలో 54/0 తో ఉంది. అయితే.. రుతురాజ్ గైక్వాడ్ ఔట్ కాగానే.. మిగతా బ్యాట్స్‌మెన్లు ఒకరి తరువాత మరొకరు పేలవ షాట్లతో పెవిలియన్‌కు క్యూ కట్టారు.