IPL 2026: 60 ఏళ్ల వయసు వచ్చేవరకు ఆడతానన్న ధోని.. హోరెత్తిన చెపాక్‌.. వీడియో

చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అభిమానుల ఆరాధ్య దైవం మహేంద్ర సింగ్ ధోనీ మరోసారి తనదైన శైలిలో వార్తల్లో నిలిచారు.

By -  అంజి
Published on : 23 March 2026 6:58 AM IST

MS Dhoni, IPL 2026, Chennai Super Kings, CSK, Sivakarthikeyan, Chepauk, Dhoni retirement, Ruturaj Gaikwad, IPL news, Cricket updates

IPL 2026: 60 ఏళ్ల వయసు వచ్చేవరకు ఆడతానన్న ధోని.. హోరెత్తిన చెపాక్‌.. వీడియో 

చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అభిమానుల ఆరాధ్య దైవం మహేంద్ర సింగ్ ధోనీ మరోసారి తనదైన శైలిలో వార్తల్లో నిలిచారు. తాజాగా చెపాక్ స్టేడియంలో జరిగిన ఒక కార్యక్రమంలో ధోనీ తన రిటైర్మెంట్‌పై సరదాగా స్పందిస్తూ, ఏకంగా 60 ఏళ్ల వరకు ఆడతానని జోక్ చేయడంతో స్టేడియం మొత్తం హోరెత్తిపోయింది. ప్రస్తుతం 44 ఏళ్ల వయసున్న ధోనీ, ఐపీఎల్ 2026 సీజన్ కోసం సిద్ధమవుతున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.

మార్చి 22న జరిగిన సీఎస్‌కే అభిమానుల సమావేశంలో కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివకార్తికేయన్ మాట్లాడుతూ.. ధోనీకి తానూ ఒక పెద్ద అభిమానినని, రిటైర్మెంట్ గురించి ఆలోచించకుండా మరికొన్నాళ్ల పాటు పసుపు రంగు జెర్సీలో అలరించాలని కోరారు. దీనికి ధోనీ స్పందిస్తూ.. ఈ వయసులో ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడం సవాలుతో కూడుకున్న పని అని చెబుతూనే, ఫన్నీగా 60 ఏళ్ల వరకు ఆడతానని అనడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఐపీఎల్‌లో ధోనీ ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 278 మ్యాచ్‌లు ఆడి 5439 పరుగులు చేసిన ధోనీ, తన సారథ్యంలో సీఎస్‌కేకు ఐదు ఐపీఎల్ టైటిళ్లను అందించారు. 2024 సీజన్‌కు ముందే రుతురాజ్ గైక్వాడ్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించినప్పటికీ, జట్టులో ఆయన ప్రాధాన్యత తగ్గలేదు. గత సీజన్‌లో గైక్వాడ్ గాయపడినప్పుడు ధోనీ మళ్లీ నాయకత్వ బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. అయితే ప్రస్తుతం జట్టు పూర్తిస్థాయిలో గైక్వాడ్ నాయకత్వంలోకి మారుతోంది.

ఈ ఐపీఎల్ 2026 ధోనీకి చివరిదా? అనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. సీఎస్‌కే సీఈఓ కాశీ విశ్వనాథన్ ఇప్పటికే ధోనీ పూర్తి సీజన్ అందుబాటులో ఉంటారని స్పష్టం చేశారు. అయితే జట్టులో ఆయన పాత్ర కొంత మారే అవకాశం ఉంది. గత కొన్ని సీజన్లుగా ధోనీ కేవలం ఫినిషర్‌గా చివరి ఓవర్లలో మాత్రమే బ్యాటింగ్‌కు వస్తున్నారు. 'ఇంపాక్ట్ ప్లేయర్' నిబంధన కూడా ఆయనకు కలిసి వస్తోంది. సంజూ శాంసన్ వంటి ఆటగాళ్లు జట్టులోకి రావడంతో వికెట్ కీపింగ్ బాధ్యతలు కూడా పంచుకునే అవకాశం ఉంది. 2025 సీజన్‌లో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన సీఎస్‌కే, ఈ సీజన్‌లో ధోనీ అనుభవంతో మళ్లీ పుంజుకోవాలని చూస్తోంది.

Next Story