ట్రాఫిక్ ఉల్లంఘన.. ఎంఎస్ ధోనికి జరిమానా
టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చిక్కుల్లో పడ్డారు. రాంచీలో అతివేగంగా వాహనం నడిపినందుకు ట్రాఫిక్ పోలీసులు...
By - అంజి |
ట్రాఫిక్ ఉల్లంఘన.. ఎంఎస్ ధోనికి జరిమానా
టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చిక్కుల్లో పడ్డారు. రాంచీలో అతివేగంగా వాహనం నడిపినందుకు ట్రాఫిక్ పోలీసులు ఆయనకు జరిమానా విధించారు. దీనితో పాటు జార్ఖండ్ హౌసింగ్ బోర్డు నుంచి కూడా ఆయనకు నోటీసులు అందడం చర్చనీయాంశమైంది. రాంచీ వీధుల్లో తన వాహనంతో వేగంగా వెళ్తున్న ధోనీని ట్రాఫిక్ మానిటరింగ్ సిస్టమ్ గుర్తించింది. నిర్దేశించిన వేగ పరిమితిని మించి ప్రయాణించడంతో, మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 183 కింద ఆయనకు ₹1000 ఈ-చలానా జారీ అయింది. రాంచీలోని ఆటోమేటెడ్ నిఘా వ్యవస్థ ద్వారా ఈ ఉల్లంఘన రికార్డ్ చేయబడింది.
మరో వివాదంలో 'మిస్టర్ కూల్'
ట్రాఫిక్ ఫైన్ మాత్రమే కాకుండా, ధోనీకి జార్ఖండ్ స్టేట్ హౌసింగ్ బోర్డు నుండి కూడా నోటీసులు అందాయి. రాంచీలోని హర్ము రోడ్డులో ధోనీకి కేటాయించిన నివాస స్థలాన్ని వాణిజ్య అవసరాల కోసం వినియోగిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. కేవలం నివాసం కోసమే కేటాయించిన ప్లాట్‌లో నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు సాగిస్తున్నారనే అంశంపై అధికారులు వివరణ కోరుతున్నారు. ధోనీ ప్రస్తుతం రింగ్ రోడ్డులోని తన కొత్త నివాసానికి మారినప్పటికీ, పాత ఇంటి స్థలంపై ఈ వివాదం చెలరేగింది.
IPL 2026 కోసం సిద్ధమవుతున్న ధోనీ
ఒకవైపు వ్యక్తిగత వివాదాలు ఉన్నప్పటికీ, ధోనీ ఐపీఎల్ 2026 కోసం మైదానంలో చెమటోడుస్తున్నారు. 44 ఏళ్ల వయసులోనూ ధోనీ నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. 2025 సీజన్‌లో సిఎస్‌కె పట్టికలో అట్టడుగున (14 మ్యాచ్‌ల్లో 10 ఓటములు) నిలవడంతో, ఈసారి ఎలాగైనా పుంజుకోవాలని జట్టు పట్టుదలగా ఉంది. ధోనీని 'అన్‌క్యాప్డ్ ప్లేయర్' రూల్ కింద ₹4 కోట్లకు సిఎస్‌కె రిటైన్ చేసుకుంది. గత ఏడాది 14 మ్యాచ్‌ల్లో 135.17 స్ట్రైక్ రేట్‌తో 196 పరుగులు చేశారు. ఇన్నింగ్స్ చివరలో మెరుపు క్యామియోలతో ధోనీ ఇప్పటికీ జట్టుకు కీలక శక్తిగా ఉన్నారు.