ధోనీ గురించి ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
మహేంద్రసింగ్ ధోనీ. ఇండియన్ క్రికెట్‌లో చరిత్ర సృష్టించాడు. కెప్టెన్ కూల్‌గా పేరు సంపాదించాడు.
By Srikanth Gundamalla Published on 6 July 2023 2:14 PM ISTధోనీ గురించి ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
మహేంద్రసింగ్ ధోనీ. ఈ పేరు ఎవరికీ పెద్దగా పరిచయం అవసరం లేని వ్యక్తి. ఇండియన్ క్రికెట్‌లో చరిత్ర సృష్టించాడు. కెప్టెన్ కూల్‌గా పేరు సంపాదించాడు. ఆయన్ని ఆదర్శంగానే తీసుకుని ఇప్పటికీ ఇండియన్ టీమ్‌లో కొందరు ఆటగాళ్లు ఆట ఆడుతున్నారు. ధోని టీమ్‌ను నడిపించే గొప్ప నాయకుడు. దాదాపు 16 ఏళ్ల పాటు టీమిండియాకు విశేషమైన సేవలను అందించాడు. 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఆ తర్వాత ఐపీఎల్‌లో మాత్రమే కనిపిస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. గత ఐపీఎల్ సీజన్‌లోనే చూశాం మహేంద్రసింగ్ ధోనీకి ఉన్న క్రేజ్ గురించి. ఆయన ఒక్కసారి గ్రౌండ్‌లోకి అడుగుపెడితే చాలు స్టేడియం అంతా అరుపులే వినిపించేవి. ధోనీ కనీసం ఒక్క బాల్ ఆడినా చాలని.. ఆయన ఆట కోసం ఎదురు చూసినవాళ్లూ ఉన్నారు. ఇక కెప్టెన్‌గానూ ఆయన ఎన్నో ఘనవిజయాలు సాధించారు. చివరకు గుజరాత్‌తో ఫైనల్‌లో తలబడి ఉత్కంఠ పోరులో ఐపీఎల్ సీజన్ 2023 టైటిల్‌ను గెలుచుకున్న విషయం తెలిసిందే.
రాంచీ కుర్రాడు ఎంఎస్ ధోని 1981 జూలై 7న జన్మించాడు. రైల్వేస్ టికెట్ కలెక్టర్‌గా సేవలందించి.. ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొని టీమిండియాకు సెలెక్ట్ అయ్యాడు. ICC ఈవెంట్లలో భారత క్రికెట్ జట్టుని విజయపథంలో నడిపించాడు. బెస్ట్ ఫినిషర్‌గానూ పేరు సంపాదించాడు. ధోనీ ఆడే హెలికాప్టర్ షాట్స్‌కు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ధోనీలా షాట్స్ ఆడాలని చాలా మంది ఆటగాళ్లు ప్రయత్నాలు చేస్తుంటారు. క్రమంగా టీమిండియాలో బాగా రాణించి కెప్టెన్ అయ్యాడు మహేంద్రసింగ్ ధోని. మూడు ఐసీసీ ట్రోఫీలను అందించాడు. ఐసీసీ వరల్డ్ టీ20 2007, ఐసీసీ ODI ప్రపంచకప్ 2011, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫి 2013లో గెలిపించి భారత్ సత్తా చాటాడు. ఇక వికెట్ కీపింగ్‌లో అయితే ధోనీని మించిన వారు లేరంటారు. ఆయన స్టంపింగ్ అత్యంత స్పీడ్‌గా ఉంటుంది.
ధోని పేరుని కెప్టెన్సీకి సిఫార్సు చేసిన సచిన్ టెండూల్కర్:
2007లో రాహుల్ ద్రవిడ్ వారసుడి కోసం టీమిండియా సెలక్టర్లు, మేనేజ్‌మెంట్ కెప్టెన్ కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ క్రమంలో సచిన్‌ను కెప్టెన్ బాధ్యతలు తీసుకోవాలని కోరారు. అయితే.. దానికి టెండూల్కర్ నిరాకరించాడు. అప్పటికే వికెట్ కీపర్ బ్యాటర్‌గా రాణిస్తున్న ధోని పేరుని సిఫార్సు చేశాడు. సచిన్ చెప్పిన తర్వాత మిగతా సీనియర్ ఆటగాళ్లు కూడా ధోనీ కెప్టెన్‌గా బాగా రాణిస్తాడని చెప్పారు. దాంతో..ధోని ప్రారంభ ఎడిషన్‌లో యువ భారత జట్టును టైటిల్ విజయం వైపు నడిపించాడు. ప్రపంచ క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌లలో ఒకరిగా నిలిచాడు.
నంబర్ 7 స్థానంలో కెప్టెన్‌గా ధోని బ్యాటింగ్ రికార్డు:
టీమిండియాలో అనేక సెంచరీలు సాధించిన లెజండరీ ఆటగాళ్లు ఉన్నారు. కానీ కెప్టెన్‌గా ధోనీ నెంబర్ ఏడో స్థానంలో బ్యాటింగ్ చేసి అత్యధిక పరుగులు సాధించాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగే తన పేరుమీద రెండు సెంచరీలు నమోదు చేసుకన్నాడు. చివరి లైనప్‌లో బ్యాటింగ్‌కు దిగి కెప్టెన్‌గా రెండు సెంచరీలు చేసింది ధోనీ మాత్రమే.
మహి రేసింగ్ టీమ్:
మహేంద్ర సింగ్ ధోనీకి బైక్‌లు, కార్లు అంటే చాలా ఇష్టం. మ్యాచ్ లు అయిపోయాక మైదానంలో బైక్, కార్లపై తిరిగిన సందర్బాలు చాలానే ఉన్నాయి. ఫెరారీ, ఆడి లాంటి విలాసవంతమైన కార్లు.. కవాసకి నింజా హెచ్2, హార్లీ డేవిడ్‌సన్ లాంటి ఖరీదైన బైక్‌లు ఎంఎస్ ధోనీ దగ్గరున్నాయి. కానీ.. మహేంద్ర సింగ్ ధోనీకి ఒక రేసింగ్ టీమ్ కూడా ఉంది. ఇది చాలా మందికి తెలియదు. దాని పేరే మహి రేసింగ్ టీమ్ ఇండియా. మహేంద్రసింగ్ ధోని, టాలీవుడ్ హీరో నాగార్జున దీనిని నిర్వహిస్తున్నారు.
ఇండియన్ ఆర్మీలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంక్:
భారత క్రికెట్ టీమ్ కోసం విశేష కృషి అందించినందుకు ప్రభుత్వం 2011లో ఎంఎస్ ధోనికి ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంక్‌ను అందజేసింది. రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ అవార్డును ధోనికి అందజేశారు. ధోనీతో పాటు షూటింగ్‌లో సేవలందించిన అభినవ్ బింద్రాకు కూడా ఈ గౌరవం అందించింది అప్పటి కేంద్ర ప్రభుత్వం.
క్రికెట్ ధోని చాయిస్ కాదు:
ధోని ముందు క్రికెటర్ అవ్వాలనుకోలేదు. మొదట ఫుట్‌బాల్‌పై ఆసక్తి కనబర్చాడు. గోల్ కీపర్‌గా ఆడేందుకు ఇష్టపడేవాడు. ఇక బ్యాట్మింటన్ అంటే కూడా ధోనికి ఇష్టం.
జాన్ అబ్రహంకు ధోని పెద్ద అభిమాని:
జాన్ అబ్రహంకి ఎంఎస్ ధోని పెద్ద అభిమాని. ధోని పొడవాటి వెంట్రుకలు అబ్రహం నుంచే ప్రేరణ పొందారని చెబుతుంటారు. 2010లో జాన్ అబ్రహంతో కలిసి హుక్ యా క్రూక్ చింత్రంలోనూ అతిథి పాత్రలో కనిపించాడు ధోని. కానీ.. దురదృష్టవశాత్తు ఆ సినిమా విడుదల కాలేదు. ధోని బయోపిక్‌గా బాలీవుడ్‌లో సినిమాను తీశారు. అదే ధోని ది అన్‌టోల్డ్ స్టోరీ. ఈ సినిమా ఘన విజయాన్ని సాధించింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ధోనీ పాత్రలో అద్భుతంగా చేశారు.