ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)2021 సీజన్‌ను కరోనా సెగ తాకిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సగం సీజన్ పూరైంది. మిగిలిన సీజన్‌ను సజావుగా నిర్వహించేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ప్రణాళికలను సిద్దం చేస్తోంది. కోల్‌కతాకు చెందిన ఇద్దరు ఆటగాళ్లు కరోనా మహమ్మారి బారిన పడడంతో ఈ సీజన్‌ను రద్దు లేదా వాయిదా వేయాలనే ప్రతిపాదనలు వచ్చినా.. బీసీసీఐ అందుకు సుముఖంగా లేదు. ఎట్టిపరిస్థితుల్లో లీగ్‌ను నిర్వహించి తీరుతామని చెప్పింది. ఆటగాళ్లను అటూఇటూ తిప్పకుండా.. ఒకే వేదికపై మిగిలిన మ్యాచులను నిర్వహిస్తే ఎలా ఉంటుందనే దానిపై చర్చిస్తోంది.
అందుకు ముంబై నగరాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే.. ముంబై నగరంలో మూడు స్టేడియాలు అందుబాటులో ఉన్నాయి గనుక అక్కడ మ్యాచ్‌లు నిర్వహిస్తే.. ఎలాంటి అడ్డంకులు ఉండబోవని బోర్డు బావిస్తోంది. ఇప్పటికే ముంబైలోని స్టేడియాలకు సమీపంలో ఉన్న హోటళ్లతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. 8 టీమ్స్‌కు బయో బబుల్ ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. ఒకవేళ బోర్డు ఇదే నిర్ణయంతో బీసీసీఐ ముందుకు వెళ్లాలని భావిస్తే కోల్‌కతా, బెంగళూరులలో జరగాల్సిన మ్యాచ్‌లు రద్దవుతాయి.