ఓడిపోతున్నాన‌ని చెవి కొరికాడు.. టీవీకి దొరికాడు

Moroccan boxer tries to bite opponent’s ear at Olympics.క్రీడ‌ల్లో గెలుపు, ఓట‌ములు స‌హ‌జం. ఓ సారి గెల‌వ‌చ్చు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 July 2021 9:43 AM IST
ఓడిపోతున్నాన‌ని చెవి కొరికాడు.. టీవీకి దొరికాడు

క్రీడ‌ల్లో గెలుపు, ఓట‌ములు స‌హ‌జం. ఓ సారి గెల‌వ‌చ్చు.. మ‌రోసారి ఓడిపోవ‌చ్చు. ఏం జ‌రిగినా క్రీడాస్పూర్తి అనేది ఉండాలి. అయితే.. బాక్సింగ్ లో ఓడిపోతున్నాన‌నే అస‌హ‌నంతో ఓ బాక్స‌ర్‌.. ప్ర‌త్య‌ర్థి చెవిని కొరికాడు. ఈ విష‌యాన్ని రిఫ‌రీ చూడ‌క‌పోయిన‌ప్ప‌టికి టీవీల్లో మాత్రం క‌నిపించింది. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో చక్క‌ర్లు కొడుతున్నాయి. ప్రత్య‌ర్థి చెవి కొరికిన‌ప్ప‌టికి అత‌డు ఓడిపోవ‌డం విశేషం. ఈ ఘ‌ట‌న టోక్యో ఒలింపిక్స్‌లో చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళితే.. బాక్సింగ్‌లో మంగళవారం హెవీ వెయిట్‌ విభాగంలో మొరాకొకు చెందిన బాక్సర్‌ యూనెస్ బ‌ల్లా, న్యూజిలాండ్‌కు చెందిన డేవిడ్‌ నికా త‌ల‌ప‌డ్డారు. బౌట్‌లో డేవిడ్‌ నికా తొలి నుంచి ఆధిపత్యం ప్రదర్శించగా.. యూనెస్‌ తేలిపోయాడు. దీంతో అసహనానికి గురైన యూనెస్‌.. మూడో రౌండ్‌లో డేవిడ్‌ చెవి కొరకడానికి యత్నించాడు. యూనీస్‌ దంతాలు తగలగానే డేవిడ్ నికా అతడిని దూరంగా నెట్టేశాడు. బ‌ల్లా చేసిన ప‌నిని రిఫ‌రీ గుర్తించ‌లేదు. టీవీల్లో మాత్రం క‌న‌బ‌డింది. ఈ మ్యాచ్‌లో డేవిడ్‌ 5-0 తేడాతో యూనీస్‌ను ఓడించాడు. కాగా.. యూనెస్‌ చేసిన ప‌నిని ప్ర‌త్య‌ర్థి డేవిడ్ నికా వెన‌కేసుకొచ్చాడు. క్రీడ‌ల్లో ఇలాంటివి మామూలేన‌ని.. అత‌డి అస‌హనాన్ని అర్థం చేసుకోగ‌ల‌న‌న్నాడు. ఆట‌గాడిగా బ‌ల్లాను గౌర‌విస్తున్నాన‌ని చెప్పాడు.

Next Story