Video : బ‌రిలోకి దిగిన తొలి మ్యాచ్‌లోనే స‌త్తా చాటిన ష‌మీ..!

బెంగాల్, మధ్యప్రదేశ్ మధ్య జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్ రెండో రోజు మహ్మద్ షమీ తన బౌలింగ్‌ లయను తిరిగిపొందాడు

By Medi Samrat  Published on  14 Nov 2024 10:13 AM GMT
Video : బ‌రిలోకి దిగిన తొలి మ్యాచ్‌లోనే స‌త్తా చాటిన ష‌మీ..!

బెంగాల్, మధ్యప్రదేశ్ మధ్య జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్ రెండో రోజు మహ్మద్ షమీ తన బౌలింగ్‌ లయను తిరిగిపొందాడు. షమీ అద్భుతంగా బౌలింగ్ చేసి నాలుగు వికెట్లు తీశాడు. దాదాపు ఏడాది తర్వాత మళ్లీ క్రికెట్ ఫీల్డ్‌లోకి వచ్చిన షమీ మ్యాజిక్ తొలిరోజు ఫలించలేదు. మ్యాచ్ తొలి రోజు షమీ 10 ఓవర్లు బౌలింగ్ చేసినా వికెట్ తీయలేకపోయాడు. అయితే రెండో రోజు షమీ మధ్యప్రదేశ్ బ్యాటింగ్ ఆర్డర్‌ను ధ్వంసం చేశాడు. బెంగాల్ తొలి ఇన్నింగ్స్ స్కోరు 228 పరుగులకు సమాధానంగా.. మధ్యప్రదేశ్ తొలిరోజు 1 వికెట్ కోల్పోయి 103 పరుగులు చేసింది.

రెండో రోజు మధ్యప్రదేశ్ బ్యాట్స్‌మెన్ షమీ ప్రాణాంతక బౌలింగ్‌కు లొంగిపోయారు. మొత్తం జట్టు 167 పరుగులకు ఆలౌట్ అయింది. మధ్యప్రదేశ్‌కు చెందిన శుభమ్ శర్మ, సరాంశ్ జైన్, కుమార్ కార్తికేయ, కుల్వంత్ ఖేజ్రోలియాలను షమీ పెవిలియ‌న్ చేర్చాడు. షమీ 19 ఓవర్లలో 54 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు.

ఈ ప్రదర్శన ఆధారంగా మహ్మద్ షమీ భారత జట్టులో పునరాగమనంపై ఆశలు సజీవంగా ఉంచుకున్నాడు. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా తొలి టెస్టు జరగనుంది. 2018-19 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్ తరఫున షమీ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

ఆస్ట్రేలియా గడ్డపై షమీ రికార్డు అద్భుతంగా ఉంది. షమీ 8 మ్యాచుల్లో 31 వికెట్లు పడగొట్టాడు. అయితే గాయం కారణంగా షమీకి వచ్చే సిరీస్‌లో టీమ్ ఇండియాలో చోటు దక్కలేదు. అయితే షమీ తిరిగి భారత జట్టులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఎవరైనా ఆటగాడు గాయపడితే షమీని బ్యాక‌ప్ ప్లేయ‌ర్‌గా జ‌ట్టులో చేర్చుకోవచ్చు.

షమీ గైర్హాజరీలో పెర్త్ టెస్టులో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌పై భారత జట్టు ఎలా ఆధిపత్యం చెలాయిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. జస్ప్రీత్ బుమ్రా భారత జట్టు ఫాస్ట్ బౌలింగ్ అటాక్‌కు నాయకత్వం వహించనున్నాడు.

Next Story