రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని కాపాడిన మహ్మద్ షమీ
రోడ్డుప్రమాదానికి గురై గాయపడ్డ వ్యక్తిని కాపాడాడు మహ్మద్ షమీ. తద్వారా తన మంచి మనుసును చాటుకున్నాడు.
By Srikanth Gundamalla Published on 26 Nov 2023 5:22 AM GMTరోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని కాపాడిన మహ్మద్ షమీ
ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ అద్భుత ప్రదర్శనను కనబరిచాడు. వరుసగా వికెట్లు పడగొడుతూ ప్రత్యర్థి టీమ్ బ్యాటర్లను పెవిలియన్‌కు పంపించాడు. అయితే.. చివరి మ్యాచ్‌లో మాత్రం టీమిండియా ఓటమిని చూసింది. ఆరోసారి వరల్డ్ కప్ ట్రోఫీని ఆస్ట్రేలియా ఎగరేసుకుపోయింది. కాగా.. తాజాగా టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీకి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. రోడ్డుప్రమాదానికి గురై గాయపడ్డ వ్యక్తిని కాపాడాడు మహ్మద్ షమీ. తద్వారా తన మంచి మనుసును చాటుకున్నాడు.
శనివారం రాత్రి నైనిటాల్ రోడ్డు మార్గంలో వెళ్లాడు మహ్మద్ షమీ. అయితే.. అతని ముందే వెళ్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఘాట్ రోడ్డు నుంచి పక్కకు దూసుకెళ్లింది. వెంటనే స్పందించిన మహ్మద్ షమీ కారు ఆపి.. అక్కడున్న కొంతమందితో కలిసి రోడ్డుప్రమాదానికి గురై కారులో ఉన్న వ్యక్తిని కాపాడాడు. తన మంచి మనసును చాటుకున్నాడు. ఈ మేరకు మహ్మద్ షమీ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకున్నాడు.
ఇన్‌స్టాగ్రామ్‌లో మహ్మద్ షమీ వీడియో పోస్టు చేస్తూ ఇలా రాసుకొచ్చాడు. 'అతను అదృష్టవంతుడు. దేవుడు అతనికి మళ్లీ జీవితం ఇచ్చాడు. నైనిటాల్‌లో అతడి కారు ఘాట్ రోడ్డు నుంచి పక్కకు దూసుకుపోయింది. నా కారుకి కాస్త ముందుగానే ఈ సంఘటన చోటుచేసుకుంది. వెంటనే అక్కడున్నవారితో కలిసి సురక్షితంగా అతడిని బయటకు తీసుకొచ్చాం. అతన్ని ఆస్పత్రికి తరలించారు. కాగా.. గాయపడ్డ వ్యక్తి పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉంది.' అని షమీ వీడియో కింద రాసుకొచ్చాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు మహ్మద్ షమీని పొగుడుతున్నారు. కొందరైతే ఈ సమయంలోనూ చమత్కరించారు. షమీ ఎప్పుడూ అవతలి వారి వికెట్లు తీస్తారు.. కానీ ఈ సారి వికెట్ సేవ్ చేశాడంటూ కామెంట్స్ పెడుతున్నారు.