చిరకాల ప్రత్యర్థులు భారత్ - పాకిస్థాన్‌ల మధ్య మ్యాచ్ అంటే అభిమానులకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్ మ్యాచ్ లు కూడా అభిమానులకు ఎంతో ఉత్కంఠతో కూడిన మ్యాచ్ లను అందిస్తూ ఉన్నాయి. గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో భారత్ ఐదు వికెట్ల తేడాతో పాకిస్థాన్‌పై విజయం సాధించగా, సూపర్ 4 మ్యాచ్‌లో పాకిస్థాన్ ఐదు వికెట్ల తేడాతో భారత్ పై గెలిచింది. రెండు మ్యాచ్‌లలో భారత ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ప్లేయింగ్ XIలో లేడు.
అయితే, అశ్విన్ ఈ మ్యాచ్‌లలో ఆడకపోవడానికి ప్రధాన కారణం 2014 ఆసియా కప్ మ్యాచ్ అని ఫుల్ కామెడీ చేస్తున్నాడు పాకిస్థాన్ మాజీ కెప్టెన్ మహ్మద్ హఫీజ్. 2014 ఆసియా కప్ లో అశ్విన్ బౌలింగ్ ను అఫ్రిదీ చితక్కొట్టాడని హఫీజ్ వెల్లడించాడు. అశ్విన్ బౌలింగ్ లో అఫ్రిదీ రెండు వరుస సిక్సర్లు బాదాడని, ఈ కారణంగానే అశ్విన్ ను పాకిస్థాన్ తో ఆడే మ్యాచ్ ల్లో టీమిండియా జట్టులోకి తీసుకోవడంలేదని హఫీజ్ చెప్పుకొచ్చాడు. అందుకు తాను అఫ్రిదీకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని కామెడీ చేశాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2014 ఆసియా కప్ లో భారత్, పాక్ మ్యాచ్ హోరాహోరీగా సాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 245 పరుగులు చేసింది. ఇక పాకిస్థాన్ జట్టు లక్ష్యఛేదనలో శుభారంభం అందుకుంది. ఇక చివరి ఓవర్లో పాక్ విజయానికి 10 పరుగులు అవసరం కాగా, అఫ్రిది రెండు వరుస సిక్సర్లు బాదడంతో పాక్ ఒక వికెట్ తేడాతో గెలిచింది.