ఇండియన్ ఉమెన్స్ టీమ్ కెప్టెన్ మిథాలీ రాజ్ అంతర్జాతీయ క్రికెట్‌లో గొప్ప మైలురాయిని చేరుకుంది. అన్ని ఫార్మాట్లలో కలిపి పదివేల పరుగులు పూర్తి చేసింది. మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో 10 వేల పరుగులు చేసిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా నిలిచింది. ఓవరాల్‌గా రెండో మహిళా క్రికెటర్‌గా రికార్డులకు ఎక్కింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో మిథాలీ 50 బంతుల్లో 5 పోర్లతో 36 పరుగులు పరుగులు చేసింది. 35 పరుగుల వ్యక్తిగత పరుగుల వద్ద మిథాలీ ఈ మైలురాయిని అందుకుంది.
మిథాలి రాజ్ కంటే ముందు ఇంగ్లాండ్ ప్లేయర్ చార్లెట్ ఎడ్వర్డ్స్ అంతర్జాతీయ క్రికెట్‌లో 10 వేల పరుగులు చేసింది. ఎడ్వర్డ్స్ అన్ని ఫార్మాట్లు కలిపి 309 మ్యాచ్‌లలో ఈ ఘనతను అందుకోగా.. మిథాలీ 311వ మ్యాచ్‌లో ఈ మార్క్ దాటింది. మొత్తం 10 టెస్టుల్లో 663 పరుగులు, 211 వన్డేలో 6938 పరుగులు అలాగే 89 టీ 20 మ్యాచ్ లలో2364 పరుగులు చేసింది. ప్రస్తుతం టీ20, టెస్టులకు దూరమైన మిథాలీ.. వన్డేల్లో మాత్రమే కొనసాగుతోంది. 'వాటే ఛాంపియన్ ప్లేయర్ మిథాలీ రాజ్' అంటూ బీసీసీఐ(భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు) ట్వీట్ చేసింది.