IPL-2024: కమిన్స్‌ కంటే ఎక్కువ ధర పలికిన మిచెల్ స్టార్క్‌

ఐపీఎల్‌-2024 వేలం కొనసాగుతోంది. ఆటగాళ్లను రికార్డు స్థాయి ధరలకు కొనుగోలు చేస్తున్నాయి ఆయా ఫ్రాంచైజీలు.

By Srikanth Gundamalla  Published on  19 Dec 2023 4:25 PM IST
mitchell starc, record auction, ipl-2024,

IPL-2024: కమిన్స్‌ కంటే ఎక్కువ ధర పలికిన మిచెల్ స్టార్క్‌

ఐపీఎల్‌-2024 వేలం కొనసాగుతోంది. దుబాయ్‌ వేదికగా ఈ వేలం కొనసాగుతుండగా.. ఆటగాళ్లను రికార్డు స్థాయి ధరలకు కొనుగోలు చేస్తున్నాయి ఆయా ఫ్రాంచైజీలు. ఎవరికి వారు తగ్గేదే లేదు అన్నట్లుగా భారీగా వేలం పాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా ఆస్ట్రేలియా స్టార్‌ బౌలర్ మిచెల్ స్టార్క్‌ రికార్డు సృష్టించాడు. మిచెల్‌ స్టార్క్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్‌ రూ.24.70 కోట్లకు కొనుగోలు చేసింది. మిచెల్‌ స్టార్క్‌ రూ.2 కోట్ల బేస్‌ ప్రైస్‌తో వేలంలోకి రాగా.. ఇతడిని దక్కించుకునేందుకు తీవ్రంగా పోటీ పడ్డారు. గుజరాత్ టైటాన్స్, కేకేఆర్‌ తీవ్రంగా పోటీ పడగా.. చివరకు కోల్‌కతా అతడిని సొంతం చేసుకుంది.

కాగా.. ఇదే వేలంలో ముందుగా ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌ను రూ.20.50 కోట్ల రికార్డు ధరకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కొనుగోలు చేసింది. ఇదే రికార్డు ధర అనుకుంటుండగా ఆదిలో ఆ మార్క్‌ను చేరుకున్నాడు మరో ఆస్ట్రేలియా ప్లేయర్ మిచెల్ స్కార్ట్‌. ప్యాట్‌ కమిన్స్‌ రికార్డును ధరను బ్రేక్‌ చేసి.. తన పేరిట కొత్త రికార్డు రాసుకున్నాడు. కాగా.. మిచెల్‌ స్టార్క్‌ చివరగా 2015 సీజన్‌లో ఆర్‌సీబీ తరఫున ఆడాడు. ప్రస్తుతం వరల్డ్‌ క్లాస్‌ పేసర్లలో మిచెల్‌ స్టార్క్‌ ఒకడుగా కొనసాగుతున్నాడు. ఇటీవల భారత్‌ వేదికగా జరిగిన వన్డే వరల్డ్‌ కప్‌లోనూ స్టార్క్‌ అద్భుత ప్రదర్శనను కనబర్చాడు. వరల్డ్‌ కప్‌లో మంచి ప్రదర్శన కనబర్చిన మరో ఆటగాడు ట్రావిస్ హెడ్‌. ఇతడిని సన్‌రైజర్స్‌ హైదరాబాద్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.


Next Story