భారత దిగ్గజ అథ్లెట్‌ మిల్కాసింగ్ క‌న్నుమూత‌

Milka Singh passes away.దేశానికి ఎన్నో గొప్ప విజ‌యాలు సాధించి పెట్టిన దిగ్గజ పరుగుల వీరుడు,

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Jun 2021 7:00 AM IST
భారత దిగ్గజ అథ్లెట్‌ మిల్కాసింగ్ క‌న్నుమూత‌

దేశానికి ఎన్నో గొప్ప విజ‌యాలు సాధించి పెట్టిన దిగ్గజ పరుగుల వీరుడు, ఫ్లయింగ్‌ సిఖ్‌గా ఖ్యాతిగాంచిన భారత దిగ్గజ అథ్లెట్‌ మిల్కా సింగ్ క‌న్నుమూశారు. క‌రోనా అనంత‌ర స‌మ‌స్య‌ల‌తో శుక్ర‌వారం ఆయ‌న ఆరోగ్యం ఒక్క‌సారిగా క్షీణించింది. జ్వరంతో పాటు ఆక్సిజన్‌ లెవల్స్‌ తగ్గడంతో ఐసీయూకు తరలించారు. అయిన‌ప్ప‌టికి ఫ‌లితం లేకుండా పోయింది. రాత్రి 11.30కు ఆయ‌న తుదిశ్వాస విడిచారు. ఆయ‌న వ‌య‌స్సు 91 సంవ‌త్స‌రాలు.

ఇంటి వంట మనుషుల్లో ఒకరు కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆ వ్యక్తి ద్వారా మే 20వ తేదీన మిల్కాసింగ్‌కు వైరస్‌ సోకింది. మే 24న మొహాలీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. నెగెటివ్‌ రావడంతో మే 30న డిశ్చార్జి అయినప్పటికీ ఆక్సిజన్‌ స్థాయిలు పడిపోవడంతో జూన్‌ 3న ఆయన్ను చండీగఢ్‌లోని పీజీఐఎంఈఆర్‌లో చేర్పించారు. అక్కడే చికిత్స పొందుతూ కన్నుమూశారు. వైర‌స్ కార‌ణంగా ఆయ‌న భార్య‌, 85 ఏళ్ల నిర్మ‌ల్ కౌర్ ఆదివారం ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే.

నాలుగు సార్లు ఆసియా క్రీడల్లో స్వర్ణం సహా 1958 కామన్వెల్త్‌ గేమ్స్‌లో మిల్కా పసిడి పతకంతో మెరిశాడు. 1956, 1964 ఒలింపిక్స్‌లో భారత్‌ తరఫున బరిలోకి దిగిన ఈ పంజాబీ వెటరన్‌కు 1959లో పద్మశ్రీ అవార్డు దక్కింది. మిల్కాసింగ్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకొని 'భాగ్‌ మిల్కా భాగ్‌' అనే బాలీవుడ్‌ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన మృతితో క్రీడాలోకం మూగబోయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ప‌లువురు నివాళుల‌ర్పించారు.

Next Story