వికెట్ల పతనాన్ని వీక్షించేందుకు రికార్డు స్థాయిలో స్టేడియానికి వచ్చిన ప్రేక్షకులు
మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య యాషెస్ సిరీస్ నాలుగో మ్యాచ్ జరుగుతోంది.
By - Medi Samrat |
మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య యాషెస్ సిరీస్ నాలుగో మ్యాచ్ జరుగుతోంది. తొలిరోజు 20 వికెట్లు పడగా.. తొలిరోజు రికార్డు స్థాయిలో ప్రేక్షకులు ఈ మ్యాచ్‌ను వీక్షించడం చరిత్రగా మారింది. మొదటి రోజు MCG స్టేడియానికి మొత్తం 94,199 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. దీంతో 2015 ప్రపంచ కప్ ఫైనల్ అటెండెన్స్ రికార్డు బద్దలు అయ్యింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌కు 93,013 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. ఇది మాత్రమే కాదు, 2022 టీ20 ప్రపంచకప్ సందర్భంగా మెల్‌బోర్న్‌లో జరిగిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు మొత్తం 90,293 మంది ప్రేక్షకులు వచ్చారు.
1937లో మెల్‌బోర్న్‌లోని ఇదే మైదానంలో మొత్తం 3,50,534 మంది ప్రేక్షకులు ఐదు రోజుల పాటు టెస్ట్ మ్యాచ్‌ను వీక్షించారు, ఇది ఒక రికార్డు. ఈ టెస్టులో మొదటి రోజు 87,242 మంది, రెండో రోజు 85,147 మంది, మూడో రోజు 83,073 మంది, నాలుగో రోజు 43,867 మంది, ఐదో రోజు 74,362 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. ఇది చాలా అరుదుగా జరుగుతుంది. నాలుగో రోజు కంటే ఐదో రోజు టెస్ట్ మ్యాచ్‌కు ఎక్కువ మంది ప్రేక్షకులు వచ్చారు. మ్యాచ్ ఐదో రోజుకు చేరుకుని ఉత్కంఠగా మారడంతో ఇలా జరిగింది.
అయితే, ఈ రికార్డు 2024 సంవత్సరంలో బద్దలైంది. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG)లో జరిగిన బాక్సింగ్ డే టెస్ట్‌కు రికార్డు స్థాయిలో ప్రేక్షకులు హాజరయ్యారు. మొత్తం 373,691 మంది మ్యాచ్‌ను వీక్షించారు. ఇది ప్రపంచ రికార్డు. మరి 2025లో జరిగే ఈ బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్ ఈ రికార్డును బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి.
ఇక నాలుగో టెస్టు మ్యాచ్ గురించి చెప్పాలంటే తొలిరోజు మొత్తం 20 వికెట్లు పడ్డాయి. ఆతిథ్య ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 152 పరుగులకు ఆలౌట్ అయ్యింది. జోష్ టాంగ్ 11.2 ఓవర్లలో 45 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీయగా, గస్ అట్కిన్సన్ రెండు వికెట్లు తీశాడు. దీనికి సమాధానంగా ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ఆరంభించగా.. కేవలం 110 పరుగులకే అన్ని వికెట్లు కోల్పోయింది. నెసర్‌కు నాలుగు వికెట్లు, బోలాండ్‌కు మూడు వికెట్లు లభించాయి. మిచెల్ స్టార్క్ ఖాతాలో రెండు వికెట్లు పడ్డాయి.