అబుదాబిలోని ఎతిహాద్ స్టేడియంలో జరుగుతున్న మినీ వేలంలో కొందరు ఆటగాళ్లు భారీ ధరకు అమ్ముడుపోగా, మరికొంత మంది ఆటగాళ్లు ఇంకా అమ్ముడుపోలేదు. వేలంలో అతిపెద్ద పర్స్‌తో వచ్చిన కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాళ్లపై భారీ మొత్తాన్ని వెచ్చిస్తోంది. కేకేఆర్ మొదట రికార్డు స్థాయిలో రూ.25.20 కోట్లకు కెమెరూన్ గ్రీన్‌ను దక్కించుకుంది. ఆ తర్వాత శ్రీలంక స్పీడ్‌స్టర్ మతిషా పతిరన కోసం చాలా డబ్బు ఖర్చు చేసింది.
మతిషా పతిరనను కోల్‌కతా రూ.18 కోట్లకు జట్టులో చేర్చుకుంది. దీంతో ఐపీఎల్ వేలంలో అత్యంత ఖరీదైన శ్రీలంక ఆటగాడిగా పతిరన నిలిచాడు. పతిరన బేస్ ధర రూ.2 కోట్లు. మొదట అతడిని కొనుగోలు చేసేందుకు ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఆసక్తి చూపాయి. రెండు జట్లు రూ.15 కోట్లకు మించి చెల్లించేందుకు పోటీ పడ్డాయి. రూ.16 కోట్ల వద్ద కోల్‌కతా ఎంట్రీ ఇచ్చింది. దీని తర్వాత కోల్‌కతా, లక్నో పతిరన కోసం పోటీ పడ్డాయి. లక్నో పతిరనను రూ.17.80 కోట్ల వద్ద వదులుకుంది. దీంతో కోల్‌కతా అతడిని రూ.18 కోట్లకు దక్కించుకుంది. పతిరన IPL 2025 వరకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో ఉన్నాడు. చెన్నై అతనిని 13 కోట్ల రూపాయల ధరకు విడుదల చేసింది. దీంతో అతడు వేలంలో రూ.5 కోట్ల లాభం పొందాడు.
పతిరణ తన కెరీర్‌లో ఇప్పటి వరకు 32 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. 22 సగటు, 8.68 ఎకానమీతో 47 వికెట్లు తీశాడు. లీగ్‌లో అతని అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన 4/28. పతిరన గత సీజన్‌లో నిరాశ పరిచాడు. అతను 12 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు మాత్రమే సాధించాడు. 10 కంటే ఎక్కువ ఎకానమీతో పరుగులు సమర్పించుకున్నాడు. అటువంటి పరిస్థితిలో చెన్నై అతన్ని వేలానికి ముందే విడుదల చేసింది.