కలిసి రాని చెన్నై పిచ్.. వార్న‌ర్ పైనే భారం..!

Match 3 SRH vs KKR Match Prediction.ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ మ్యాచుల్లో భాగంగా నేడు కోల్‌క‌త్తా నైట్ రైడ‌ర్స్‌తో స‌న్ రైజ‌ర్స్ హైద‌ర‌బాద్ త‌ల‌ప‌డ‌నుంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 April 2021 4:21 PM IST
IPL match3

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ లో మ‌రో ఆస‌క్తిక‌ర పోరుకు రంగం సిద్ద‌మైంది. లీగ్ మ్యాచుల్లో భాగంగా నేడు కోల్‌క‌త్తా నైట్ రైడ‌ర్స్‌తో స‌న్ రైజ‌ర్స్ హైద‌ర‌బాద్ త‌ల‌ప‌డ‌నుంది. ఇరు జ‌ట్ల‌కు ఈ సీజ‌న్ లో ఇదే తొలి మ్యాచ్. దీంతో ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించి టోర్నీలో శుభారంభం చేయాల‌ని ఇరు జ‌ట్లు భావిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఐపీఎల్ మ్యాచుల్లో ఇప్పటిదాకా ఈ రెండు జట్లు 19 సార్లు తలపడ్డాయి. సన్ రైజర్స్ ఏడుసార్లు మాత్రమే విజయం సాధించ‌గా.. కోల్‌క‌త్తా 12 సార్లు గెలుపొందింది. ఈ సంగతెలా ఉన్నప్పటికీ.. చెెన్నై చెపాక్ స్టేడియం పిచ్ కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రతికూలంగానే ఉంది. ఎంఏ చిదంబరం స్టేడియంలో ఆడిన మూడు మ్యాచుల్లో వార్నర్ సేన ఓటమి పాలైంది.

స‌న్‌రైజ‌ర్స్ కు అతి పెద్ద బ‌లం కెప్టెన్ వార్న‌ర్. అత‌డు జ‌ట్టును ముందుండి న‌డిపిస్తాడు. గ‌జ్జ‌ల్లో గాయంతో భార‌త్‌తో టెస్టు సిరీస్ నుంచి త‌ప్పుకున్న వార్న‌ర్‌.. ఎలా ఆడ‌తాడు అనే దానిపైనే అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంది. ఓపెనింగ్ లో వార్న‌ర్‌తో పాటు బెయిర్ స్టో అదిరే ఆరంభాన్ని ఇస్తే.. మ‌నీశ్ పాండే, కేన్ విలియ‌మ్ లు వాటిని భారీ స్కోర్లుగా మ‌లుస్తారు. ఇక బౌలింగ్ లో రైజ‌ర్స్‌కు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎంత‌టి చిన్న ల‌క్ష్యాన్ని అయినా ఆ జ‌ట్టు కాపాడుకుంటుంది. భువ‌నేశ్వ‌ర్ కుమార్ బౌలింగ్ ద‌ళాన్ని న‌డిపించ‌నుండ‌గా.. న‌ట‌రాజ‌న్ , సందీప్ డెత్ ఓవ‌ర్ల‌లో కీల‌కం కానున్నారు. ర‌షీద్ ఖాన్ స్పిన్ విభాగ భారాన్ని మోయ‌నున్నారు.

ఈ సారి మోర్గాన్ కెప్టెన్సీలో బ‌రిలోకి దిగుతున్న నైట్ రైడ‌ర్స్ ఎలాంటి ప్ర‌ద‌ర్శ‌న చేస్తుందో చూడాలి. కెప్టెన్ మోర్గాన్‌తో పాటు శుభ్‌మ‌న్ గిల్‌, నితీశ్ రాణా, దినేశ్ కార్తీక్‌, ర‌సెల్ తో కూడిన ఆజ‌ట్టు బ్యాటింగ్ విబాగం ప‌టిష్టంగానే ఉంది. ఇక నిషేదం త‌రువాత జ‌ట్టులోకి వ‌చ్చిన ఆల్‌రౌండ‌ర్ ష‌కీబ్ ఎలాంటి పాత్ర‌ను పోషిస్తాడోన‌ని అంద‌రూ ఎదురుచూస్తున్నారు. ఇక బౌలింగ్‌లో ప్ర‌ధానంగా ఫెర్గూస‌న్‌, క‌మిన్స్‌ల మీద‌నే భారం ఉంది. వీరితో పాటు భార‌త బౌల‌ర్లు వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, శివ‌మ్ మామి, క‌మ‌లేశ్ నాగ‌ర్‌కోటి ప్ర‌త్య‌ర్థి బ్యాట్స్‌మెన్ల‌ను క‌ట్ట‌డి చేయ‌డంపైనే కోల్‌క‌త్తా విజ‌యావ‌కాశాలు ఆధార‌ప‌డి ఉన్నాయి.


Next Story