Video : 16 సిక్సర్లు.. 12 ఫోర్లు.. రిటైర‌య్యాక కూడా అదే విధ్వంసం..!

ఇటీవల రిటైరైన‌ న్యూజిలాండ్ మాజీ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ లెజెండ్ 90 లీగ్‌లో 160 పరుగులతో తుఫాను ఇన్నింగ్స్ ఆడి అభిమానులను ఉర్రూతలూగించాడు.

By Medi Samrat  Published on  11 Feb 2025 8:36 AM IST
Video : 16 సిక్సర్లు.. 12 ఫోర్లు.. రిటైర‌య్యాక కూడా అదే విధ్వంసం..!

ఇటీవల రిటైరైన‌ న్యూజిలాండ్ మాజీ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ లెజెండ్ 90 లీగ్‌లో 160 పరుగులతో తుఫాను ఇన్నింగ్స్ ఆడి అభిమానులను ఉర్రూతలూగించాడు. షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఛత్తీస్‌గఢ్ వారియర్స్ తరఫున ఆడుతున్న మార్టిన్ గప్టిల్ 49 బంతుల్లో 16 సిక్సర్లు, 12 ఫోర్ల సాయంతో 160 పరుగులు చేశాడు. టాస్ గెలిచిన‌ ఛత్తీస్‌గఢ్ వారియర్స్‌ ఇన్నింగ్స్‌ను మార్టిన్ గప్టిల్, రిషి ధావన్ నెమ్మదిగా ఆరంభించినా.. బిగ్ బాయ్స్ బౌలర్లపై ఊహించని విధంగా గేర్లు మార్చారు.

గుప్తిల్ 326 స్ట్రైక్ రేట్‌తో కేవలం 49 బంతుల్లో అజేయంగా 160 పరుగులు చేయడం ద్వారా ఛత్తీస్‌గఢ్ వారియర్స్ బిగ్ బాయ్స్ పై 89 పరుగుల తేడాతో విజయం సాధించడంలో సహాయపడింది. ఇషాన్ మల్హోత్రా వేసిన ఒక ఓవర్‌లో 29 పరుగులు చేసి కేవలం 34 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఆ తర్వాత 13 బంతుల్లో మరో 50 పరుగులు జోడించి జట్టు స్కోరును 240 పరుగులకు చేర్చాడు. గుప్టిల్‌ ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 16 సిక్సర్లు కొట్టాడు.

మార్టిన్ అజేయంగా 160 పరుగులు చేయగా, రిషి ధావన్ కూడా 42 బంతుల్లో 76 పరుగులు చేసి అతనికి మద్దతుగా నిలిచాడు. వీరిద్దరూ కలిసి 240 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు, ఇది టోర్నమెంట్‌లో అతిపెద్ద భాగస్వామ్యం కూడా. దీంతో టోర్నీలో 200+ పరుగులు చేసిన తొలి జట్టుగా ఛత్తీస్‌గఢ్ వారియర్స్ నిలిచింది.

ఛేద‌న‌లో బిగ్ బాయ్స్ ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. జట్టు ఆరంభం నుంచి తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు కనిపించింది. ఓపెన‌ర్లు జతిన్ సక్సేనా (4), కెప్టెన్ ఇషాన్ మల్హోత్రా (11) స్వల్ప వ్యవధిలోనే వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌కు చేరుకున్నారు. సౌరభ్ తివారీ (37), రాబిన్ బిష్త్ (55 నాటౌట్) పోరాడినప్పటికీ, నిర్ణీత‌ ఓవ‌ర్ల‌లో జట్టు 4 వికెట్లు కోల్పోయి 151 పరుగులకే చేరుకోగలిగింది. దీంతో 89 పరుగుల భారీ ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ విజయంతో ఛత్తీస్‌గఢ్ వారియర్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.

Next Story