ఒలింపిక్స్‌లో ఒకటి కంటే ఎక్కువ పతకాలు సాధించిన భారతీయ క్రీడాకారులెవరో తెలుసా.?
పారిస్ ఒలింపిక్స్‌లో భారత మహిళా షూటర్ మను భాకర్ మరోసారి అద్భుత ప్రదర్శన చేసి చరిత్ర సృష్టించింది.
By Medi Samrat Published on 30 July 2024 11:18 AM GMTపారిస్ ఒలింపిక్స్‌లో భారత మహిళా షూటర్ మను భాకర్ మరోసారి అద్భుత ప్రదర్శన చేసి చరిత్ర సృష్టించింది. మహిళల వ్యక్తిగత 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో ఆమె కాంస్య పతకాన్ని గెలుచుకుంది. మంగళవారం జరిగిన మిక్స్‌డ్ టీమ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్‌లో సరబ్‌జోత్ సింగ్‌తో కలిసి మను భారత్‌కు మరో కాంస్య పతకాన్ని అందించి చరిత్ర సృష్టించింది. ఈ విధంగా తమ పేరిట ఒకటి కంటే ఎక్కువ ఒలింపిక్ పతకాలను కలిగి ఉన్న కొద్దిమంది భారతీయ అథ్లెట్ల సరసన మను చేరింది.
కాంస్య పతక పోరులో భారత జోడీ మను-సరబ్‌జోత్ 16-10తో దక్షిణ కొరియాకు చెందిన ఓహ్ యే జిన్-లీ వోన్హోపై విజయం సాధించింది. ఓవరాల్ గా భారత్ ఎనిమిది రౌండ్లలో విజయం సాధించగా.. కొరియా ఐదు రౌండ్లలో విజయం సాధించింది.
దీంతో ఒలింపిక్స్‌లో ఒకటి కంటే ఎక్కువ పతకాలు తెచ్చిన నాలుగో భారత అథ్లెట్‌గా మను నిలిచింది. మను కంటే ముందు నార్మన్ ప్రిచర్డ్, సుశీల్ కుమార్, పీవీ సింధు ఈ రికార్డును కలిగివున్నారు. ఇంగ్లండ్‌కు చెందిన నార్మన్ ప్రిచర్డ్ 1900లో 200 మీటర్లు, 200 మీటర్ల హర్డిల్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి పతకాలు సాధించాడు. సుశీల్ లండన్ ఒలింపిక్స్ 2012లో రజత పతకం, బీజింగ్ ఒలింపిక్స్-2008 గేమ్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. ఈ విజయాలతో స్వాతంత్ర్యం తర్వాత రెండు వేర్వేరు ఒలింపిక్స్‌లో ఒకటి కంటే ఎక్కువ పతకాలను గెలుచుకున్న భారతదేశపు మొదటి అథ్లెట్‌గా సుశీల్ నిలిచాడు.
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సింధు 2016 రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించింది. ఆ తర్వాత ఫైనల్‌లో స్పెయిన్‌కు చెందిన కరోలినా మారిన్ చేతిలో ఓడిపోయింది. ఒలింపిక్ బ్యాడ్మింటన్‌లో భారత్‌కు రజత పతకం రావడం ఇదే తొలిసారి. సింధు తర్వాత టోక్యో 2020లో కాంస్య పతకాన్ని గెలుచుకుంది.
ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన మూడో భారతీయ క్రీడాకారిణిగా, రెండో మహిళగా మను నిలిచింది. సింధు రెండు వేర్వేరు ఒలింపిక్స్‌లో ఈ ఫీట్ సాధించగా.. మను ఒక్క ఒలింపిక్స్‌లోనే ఈ ఘనత సాధించింది. దేశం నుంచి ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి మహిళా షూటర్‌గా మను రికార్డు సృష్టించింది. మను కంటే ముందు నార్మన్ ప్రిట్‌చర్డ్ 1900 గేమ్స్‌లో అథ్లెటిక్స్‌లో రెండు రజత పతకాలను గెలుచుకున్నప్పటికీ.. అప్పుడు భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉంది. నార్మన్ మూలాలు బ్రిటిష్‌కు చెందినవి.