LSG vs DC : ఐదు వికెట్ల‌తో చెల‌రేగిన వుడ్‌.. ఢిల్లీపై ల‌క్నో ఘ‌న విజ‌యం

ల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ 50 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 April 2023 9:07 AM IST
IPL 2023, LSG vs DC

ఢిల్లీపై ల‌క్నో ఘ‌న విజ‌యం

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్‌) సీజ‌న్ 16లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ బోణీ కొట్టింది. శ‌నివారం ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 50 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ల‌క్నో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 193 ప‌రుగులు చేసింది. ఐపీఎల్‌లో అరంగ్రేట మ్యాచ్ అయినప్ప‌టికీ కైల్ మేయ‌ర్స్‌(73; 38 బంతుల్లో 2 ఫోర్లు, 7సిక్స‌ర్లు) దంచికొట్టడడంతో ల‌క్నో భారీ స్కోర్ చేసింది. అనంత‌రం భారీ ల‌క్ష్యాన్ని చేధించే క్ర‌మంలో ఢిల్లీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 143 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది.

194 పరుగుల విజయ లక్ష్యంతో బ‌రిలోకి దిగిన ఢిల్లీ ఛేద‌న‌ను మెరుగ్గానే మొదలుపెట్టింది. ఓపెన‌ర్లు డేవిడ్ వార్న‌ర్‌(56; 48 బంతుల్లో 7 ఫోర్లు) పృథ్వీ షా(12) ఫోర్ల వేట‌లో సాగ‌డంతో 4 ఓవ‌ర్ల‌కే ఢిల్లీ 40 ప‌రుగులు చేసింది. అయితే.. ఆ త‌రువాతి ఓవ‌ర్‌లో బంతిని అందుకున్న మార్క్ వుడ్ వ‌రుస బంతుల్లో పృథ్వీ షాతో పాటు పుల్ ఫామ్‌లో ఉన్న మిచెల్ మార్ష్‌(0) పెవిలియ‌న్‌కు చేర్చి ఢిల్లీని గ‌ట్టి దెబ్బ‌తీశాడు. కొద్దిసేప‌టికే స‌ర్ఫ‌రాజ్‌ను ఔట్ చేశాడు. దీంతో ఢిల్లీ 48 ప‌రుగుల‌కే మూడు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది.

కెప్టెన్ డేవిడ్ వార్నర్, రిలీ రోసౌ (30), అక్షర్ పటేల్ (16 ) కాస్త పోరాడిన‌ప్ప‌టికి వారి పోరాట ప‌టిమ ఏ మాత్రం స‌రిపోలేదు. లక్నో బౌలర్లలో మార్క్ వుడ్ ఐదు వికెట్లు తీసుకోగా, అవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్ చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు.

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో ఇన్నింగ్స్‌లో కైల్ మేయ‌ర్స్ ఇన్నింగ్సే హెలైట్‌. ఆరో ఓవ‌ర్‌లో మేయ‌ర్స్ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను ఖ‌లీల్ జార‌విడిచాడు. అప్ప‌టికి మేయ‌ర్స్ 14 ప‌రుగుల‌తో ఉన్నాడు. ఆ త‌రువాత మొద‌లైంది ఊచ‌కోత‌. వ‌చ్చిన బంతిని వ‌చ్చిన‌ట్లుగానే బౌండ‌రీల‌కు త‌ర‌లించారు. సిక్స‌ర్ల మోత మోగించాడు. ఈ క్ర‌మంలో 28 బంతుల్లోనే అర్థ‌శ‌త‌కం బాదాడు. అక్ష‌ర్ ప‌టేల్ బౌలింగ్‌లో పెవిలియ‌న్ చేరాడు. ఆఖ‌ర్లో నికోల‌స్ పూర‌న్‌(36), ఆయుష్ బ‌దోనీ(18) లు భారీ షాట్ల‌తో అల‌రించ‌డంతో ల‌క్నో భారీ స్కోర్ చేసింది. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, చేతన్ సకారియా చెరో రెండు వికెట్లు తీశారు. ఐదు వికెట్లు పడగొట్టి ఢిల్లీ పతనాన్ని శాసించిన లక్నో బౌలర్ మార్క్ వుడ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ద‌క్కింది.

Next Story