IPL 2025 : లక్నో సూపర్‌జెయింట్స్‌కు భారీ షాక్.. రూ.11 కోట్లు పోసి కొన్న యువ ఫాస్ట్ బౌలర్‌కు గాయం..!
లక్నో సూపర్ జెయింట్స్ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ వెన్ను గాయం కారణంగా IPL 2025 ప్రథమార్ధం నుండి తప్పుకున్నాడు.
By Medi Samrat
లక్నో సూపర్ జెయింట్స్ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ వెన్ను గాయం కారణంగా IPL 2025 ప్రథమార్ధం నుండి తప్పుకున్నాడు. ESPNcricinfo యొక్క నివేదిక ప్రకారం.. మయాంక్ యాదవ్ ఇటీవల వెన్ను గాయం(వెన్నెముకలోని రెండు భాగాలను కలిపే ఎముకలో చిన్న పగుళ్లు లేదా బలహీనత) నుండి కోలుకున్నాడు. బెంగళూరులోని BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాడు.
గతేడాది అక్టోబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 అంతర్జాతీయ సిరీస్‌లో 22 ఏళ్ల మయాంక్ యాదవ్ గాయపడ్డాడు. ప్రస్తుతం మయాంక్ పునరావాసం పొందుతున్నాడు. మయాంక్ తిరిగి వచ్చే ఖచ్చితమైన తేదీని BCCI వెల్లడించలేదు. అయితే అతడు బౌలింగ్ వర్క్‌లోడ్‌తో పాటు అన్ని ఫిట్‌నెస్ ప్రమాణాలను దాటితే.. అతడు IPL 2025 రెండవ భాగంలో ఆడే అవకాశం ఉంది.
IPL 2025 మొదటి అర్ధభాగంలో మయాంక్ యాదవ్ లేకపోవడం లక్నో సూపర్‌జెయింట్స్‌కు పెద్ద షాకింగ్ వార్త. మెగా వేలానికి ముందు LSG మయాంక్‌ను 11 కోట్ల రూపాయలకు తన వద్ద ఉంచుకుంది. లక్నో 2024 సీజన్‌కు అన్‌క్యాప్డ్ ఫాస్ట్ బౌలర్‌గా మయాంక్‌ను అతని బేస్ ధర రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది. ఐపీఎల్‌లోకి అడుగుపెట్టిన వెంటనే మయాంక్ యాదవ్ తనదైన ముద్ర వేశాడు. 150 కిలోమీటర్ల వేగంతో నిలకడగా బౌలింగ్ చేసి తొలి రెండు మ్యాచ్‌ల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. ఐపీఎల్‌లో అద్భుతమైన ప్రదర్శనను చూసిన భారత జట్టు సెలక్టర్లు మయాంక్‌ను ఫాస్ట్ బౌలింగ్ పూల్‌లో చేర్చి అతనికి కాంట్రాక్ట్ ఇచ్చారు.
అయితే.. ఐపీఎల్ 2024లో మయాంక్ యాదవ్ నాలుగు మ్యాచ్‌లకే పరిమితమయ్యాడు. తర్వాత అతడు సైడ్ స్ట్రెయిన్‌తో పోరాడాడు. పునరావాస సమయంలో మయాంక్ మళ్లీ గాయపడ్డాడు. దాని కారణంగా అతడి పునరాగమనం వాయిదా పడింది. ఆ తర్వాత బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 ఇంటర్నేషనల్ సిరీస్‌కు మయాంక్ ఎంపికయ్యాడు. అయితే.. మళ్లీ గాయపడ్డాడు.. దీంతో పునరావాసం కోసం తిరిగి రావాల్సి వచ్చింది.
మయాంక్ గాయంపై అధికారిక సమాచారం BCCI వెల్లడించలేదు.. అయితే అతడి వెన్ను ఎడమ వైపున గాయం ఉందని తెలిసింది. టీమ్ డైరెక్టర్‌గా ఎల్‌ఎస్‌జిలో చేరిన జహీర్ ఖాన్.. ఫ్రాంచైజీ బీసీసీఐ మెడికల్ టీమ్‌తో టచ్‌లో ఉందని, మయాంక్ కోలుకోవడంపై దృష్టి సారిస్తోందని ఇటీవల చెప్పాడు.
IPL 2025లో లక్నో సూపర్‌జెయింట్స్ జట్టు మార్చి 24న ఢిల్లీ క్యాపిటల్స్‌తో తన మొదటి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ విశాఖపట్నంలో జరగనుంది. రిషబ్ పంత్ లక్నో సూపర్‌జెయింట్స్ బాధ్యతలు చేపట్టనున్నాడు.