జ‌రిగిందేదో జ‌రిగింది.. ఇద్ద‌రూ రిటైర్ అవ్వండి..!

గబ్బా టెస్టులో కూడా భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ విఫ‌ల‌మ‌య్యాడు.

By Medi Samrat  Published on  17 Dec 2024 8:43 AM IST
జ‌రిగిందేదో జ‌రిగింది.. ఇద్ద‌రూ రిటైర్ అవ్వండి..!

గబ్బా టెస్టులో కూడా భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ విఫ‌ల‌మ‌య్యాడు. వ్యక్తిగత కారణాల వల్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టుకు దూరమైన రోహిత్‌.. రెండో టెస్టులో పునరాగమనం చేసినా విఫ‌ల‌మ‌య్యాడు. అడిలైడ్ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 9 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీనికి ముందు, చివరి 6 టెస్ట్ మ్యాచ్‌లలో అతని సగటు 11. ఇక మూడోదైన‌ గబ్బా టెస్టు మ్యాచ్‌లో రోహిత్‌ నుంచి టీమిండియా భారీ ఇన్నింగ్స్‌ని ఆశిస్తున్న నేప‌థ్యంలో అతడు మ‌రోసారి అందరి హృదయాలను బద్దలు కొట్టాడు. 10 పరుగులు చేసిన త‌ర్వాత‌ రోహిత్ శర్మ పెవిలియన్ బాట ప‌ట్టాడు.

ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ బైలింగ్‌లో రోహిత్ అవుట‌య్యాడు. రోహిత్ త్వ‌ర‌గా ఔట్ కావడం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోహ్లీ కూడా మూడు పరుగులకే వెనుదిరిగాడు. దీంతో సోషల్ మీడియాలో అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు. అభిమానులు రిటైర్మెంట్ తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. మా ఎమెష‌న్స్‌తో ఆడుకోకండి.. రిటైర్ అయ్యి మీ పిల్ల‌ల‌తో ఆడుకోండ‌ని రోహిత్‌, కోహ్లీపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. కెప్టెన్ సాహెబ్ ఇలా డబ్ల్యుటిసి ఫైనల్‌కు ఎలా చేరుకోగలుగుతారు అని కొందరు యూజర్లు అడుగుతుండ‌గా.. మరో యూజర్ ఓపెనింగ్‌ చేయమని సలహా ఇస్తున్నారు.

న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లో రోహిత్ శర్మ విఫ‌ల‌మ‌య్యాడు. మూడు టెస్టుల్లో 6 ఇన్నింగ్స్‌ల్లో 91 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియాలో జరిగిన‌ పెర్త్ టెస్టులో రోహిత్ పాల్గొనలేదు. అతను అడిలైడ్ టెస్టులో జట్టుతో కలిసాడు. మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు దిగిన రోహిత్ ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ వరుసగా 3, 6 పరుగులు మాత్రమే చేయగలిగాడు. 6వ స్థానంలో బ్యాటింగ్ దిగి పెద్దగా రాణించలేకపోవ‌డంతో అతని సాధారణ స్థానానికి తిరిగి రావాలని అనుభవజ్ఞులు అతనికి సలహా ఇచ్చారు, అయితే గబ్బా టెస్టులో కూడా ఆర‌వ‌స్థానంలోనే బ్యాటింగ్‌కు దిగి 10 పరుగులు మాత్ర‌మే చేసి అవుటయ్యాడు. 2024 సంవత్సరంలో రోహిత్ 13 టెస్టు మ్యాచ్‌లు ఆడి 24 ఇన్నింగ్స్‌ల్లో 607 పరుగులు మాత్రమే చేశాడు. రోహిత్ త్వరలో ఫామ్‌లోకి వస్తాడని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.

Next Story