ఒలింపిక్ పతక విజేత హత్యకు పాల్పడ్డాడా.. సుశీల్ కుమార్ ఎక్కడ..?

look out notice on olympic medalist susheel kumar. ఢిల్లీలో ఓ రెజ్లర్ మరణంపై పోలీసు అధికారులు విచారణ చేస్తూ ఉన్నారు. ఓ వ్యక్తిని పట్టుకున్న పోలీసులు సుశీల్ కుమార్ పై కూడా అభియోగాలు మోపారు.

By Medi Samrat  Published on  10 May 2021 1:49 PM IST
susheel kumar

ఒలింపిక్ పతక విజేత రెజ్లర్ సుశీల్ కుమార్ వివాదంలో ఇరుక్కున్న సంగతి తెలిసిందే..! ఢిల్లీలో ఓ రెజ్లర్ మరణంపై పోలీసు అధికారులు విచారణ చేస్తూ ఉన్నారు. ఓ వ్యక్తిని పట్టుకున్న పోలీసులు సుశీల్ కుమార్ పై కూడా అభియోగాలు మోపారు. ఎఫ్.ఐ.ఆర్. కూడా నమోదు చేశారు. చనిపోయిన వ్యక్తి ఢిల్లీ పోలీసు హెడ్ కానిస్టేబుల్ కుమారుడు. ఇటీవల ఢిల్లీలోని ఛత్రపాల్ స్టేడియం వద్ద గత రాత్రి జరిగిన ఘర్షణలో ఓ రెజ్లర్ మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటనలో భారత ఒలింపిక్ మెడలిస్ట్ సుశీల్ కుమార్ పాత్ర ఉందా అన్న విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఛత్రాసాల్ స్టేడియం వద్ద గత మంగళవారం రాత్రి రెండు వర్గాల రెజ్లర్ల మధ్య ఘర్షణ చెలరేగింది. ఓ వర్గం కాల్పులు జరిపింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన రెజ్లర్లను ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాగర్ కుమార్ అనే 23 ఏళ్ల జాతీయ స్థాయి మాజీ రెజ్లర్ మరణించాడు. ఒలింపిక్ పతక విజేత రెజ్లర్ సుశీల్ కుమార్, అతడి సహచరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.

తాజాగా సుశీల్ కుమార్ పై ఢిల్లీ పోలీసులు సోమవారం లుకవుట్ నోటీసులు జారీ చేశారు. సాగర్ ధన్కడ్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న సుశీల్ కుమార్ పరారీలో ఉన్నాడు. కొద్ది రోజులుగా అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. తాజాగా లుకవుట్ సర్క్యులర్ ఇచ్చారు. గొడవ తర్వాతి రోజు నుంచే సుశీల్ పరారీలో ఉన్న సంగతి తెలిసిందే..! ఢిల్లీ నుంచి వెళ్లి హరిద్వార్ లోని ఓ ఆశ్రమంలో ఉన్నాడని, అక్కడి నుంచి రుషికేశ్ కు వెళ్లి తిరిగి ఢిల్లీ వచ్చాడని తెలుస్తోంది. ఆ తర్వాత హర్యానాలో వుంటూ మాటిమాటికీ ప్రాంతాలను మారుస్తున్నట్టు సమాచారం. ఆదివారం మరో ఇద్దరు బాధితుల స్టేట్ మెంట్లను పోలీసులు రికార్డ్ చేయగా.. వారు సుశీల్ కుమారే సాగర్ ను హత్య చేశాడని బాధితులు వాంగ్మూలం ఇచ్చారు. దీంతో అతడిని పట్టుకునేందుకు లుకవుట్ నోటీసులు జారీ చేసినట్టు అదనపు డీసీపీ డాక్టర్ గురిక్బాల్ సింగ్ సిద్ధూ చెప్పారు. సుశీల్ ను పట్టుకునేందుకు అతడి బంధువుల ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నామన్నారు.

Next Story