ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పైనల్ మ్యాచ్ భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతోంది. ఇంగ్లండ్‌లోని ఓవల్ మైదానంలో ఇప్పటికే నాలుగు రోజుల మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో మూడు ఇన్నింగ్స్‌లు కూడా ముగిశాయి. చివరగా నాలుగో ఇన్నింగ్సులో భారత జట్టు విజయానికి 280 పరుగులు చేయాల్సివుండగా.. ఆస్ట్రేలియా గెలుపు కోసం ఏడు వికెట్లు పడగొట్టాల్సివుంది. ఫైనల్ మ్యాచ్‌లో చివరి రోజు ఆట మాత్రమే మిగిలి ఉంది. అయితే వర్షం ఈ సమీకరణాలన్నింటినీ మార్చగలదు. నాలుగో రోజు వర్షం కురుస్తుందని అంచనా వేసినా.. ఒక్క చుక్క కూడా పడలేదు. దీంతో రోజంతా ఆట జరిగింది.
మ్యాచ్ ఐదో రోజు కూడా ఓవల్‌లో వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి. వర్షం కారణంగా ఆట గంట లేదా అంతకంటే ఎక్కువసేపు ఆగిపోయినట్లయితే.. ఈ మ్యాచ్ రిజర్వ్ డే వరకు కొనసాగవచ్చు. ఒకవేళ డ్రా అయితే.. భారత్, ఆస్ట్రేలియాలను ఉమ్మడి విజేతలుగా ప్రకటిస్తారు. లండన్‌లో స్థానిక కాలమానం ప్రకారం.. ఉదయం 9 గంటలకు 61 శాతం వర్షం పడే అవకాశం ఉంది. ఉదయం 10 గంటలకు అది 49 శాతానికి తగ్గింది. మధ్యాహ్నం 3 గంటల వరకు వాతావరణం ఇలాగే ఉంటుందని అంచనా. అదే సమయంలో మధ్యాహ్నం మూడు గంటలకు 65 శాతం వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి. అయితే సాయంత్రానికి కేవలం 2 శాతం మాత్రమే వర్షం కురిసే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మ్యాచ్ రిజర్వ్ డే నాడు జరిగే అవకాశం చాలా ఎక్కువని అంటున్నారు. ఆదివారం వర్షం కురిస్తే సోమవారం మ్యాచ్ జరగనుంది.