లియోనెల్ మెస్సీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న.. షాక్‌లో అభిమానులు

Lionel Messi Says 2022 World Cup Will "Surely" Be His Last.మెస్సీ త‌న రిటైర్‌మెంట్ గురించి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Oct 2022 6:02 AM GMT
లియోనెల్ మెస్సీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న.. షాక్‌లో అభిమానులు

అర్జెంటీనా సాక‌ర్ దిగ్గ‌జం లియోనల్ మెస్సీ త‌న రిటైర్‌మెంట్ గురించి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు. వ‌చ్చే నెల‌లో ఖ‌త‌ర్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ 2022 చివ‌రిద‌ని తెలిపాడు. కెరియర్‌లో చివరి మ్యాచ్ ఆడుతున్నందుకు ఒకే సమయంలో ఆందోళన, ఒత్తిడి ఫీలవుతున్నట్టు ఓ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మెస్సీ తెలిపాడు.

ఇక ప్రపంచకప్‌లో ఏమైనా జరగొచ్చున‌ని, మ్యాచ్‌లన్నీ చాలా కఠినంగా ఉంటాయని తెలిపాడు. ఫేవరెట్లుగా బ‌రిలోకి దిగినంత మాత్ర‌న విజ‌యం సొంతం అవుతుంద‌న్న గ్యారెంటీ ఏమీ లేద‌న్నాడు. అయితే చరిత్రను చూస్తే మాత్రం అర్జెంటీనా టైటిల్ రేసులో ఖ‌చ్చితంగా ఉంటుంది. ఇప్పుడున్న ప‌రిస్థితిని బ‌ట్టి ఆ అవ‌కాశం మ‌రింత ఎక్కువగా ఉందన్నాడు. అయిన‌ప్ప‌టికీ మేం ఫేవరెట్లం కాదు. మిగతా జట్లు మా కంటే కొంత పైనున్నాయనే అనుకుంటా అని మెస్సీ చెప్పాడు. 2021 కోపా అమెరికా ఫైనల్‌లో ఆతిథ్య బ్రెజిల్‌పై విజయం సాధించిన అర్జెంటీనా.. గ‌త 35 మ్యాచుల్లో ఒక్క‌సారి కూడా ఓడిపోలేదు.

మెస్సీ రిటైర్‌మెంట్ ప్ర‌క‌ట‌న‌పై పుట్‌బాల్ అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు 2006, 2010, 2014,2018 ప్ర‌పంచ‌క‌ప్‌ల‌లో మెస్సీ ఆడాడు. 2014లో ఫైన‌ల్‌లో జ‌ర్మ‌నీ చేతిలో ఓడిపోవ‌డంతో తృటిలో టైటిల్‌ను మిస్ అయ్యాడు. ఆఖ‌రి ఐదో ప్ర‌పంచ‌క‌ప్‌లోనైనా మెస్సీ అర్జంటీనాకు టైటిల్ అందిస్తాడో లేదో చూడాలి.

అర్జెంటీనా 1978, 1986 ప్రపంచకప్‌లలో విజయం సాధించింది. వచ్చే నెల 22న గ్రూప్-సిలో సౌదీ అరేబియాతో పోరుతో అర్జెంటీనా ప్రపంచకప్‌లో తన ప్రస్థానాన్ని ప్రారంభిస్తుంది. ఆ తర్వాత మెక్సికో, పోలండ్‌తో తలపడుతుంది.

Next Story