క్రికెట్ చ‌రిత్ర‌లో భారీ సిక్స‌ర్‌.. మైదానం అవతల రగ్బీ పిచ్‌పై

Liam Livingstone Hits The Biggest Six Ever At Headingley.క్రికెట్‌లో రికార్డులు బ‌ద్ద‌లు కావ‌డం సాధార‌ణ‌మైన విష‌యం.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 July 2021 9:27 AM IST
క్రికెట్ చ‌రిత్ర‌లో భారీ సిక్స‌ర్‌.. మైదానం అవతల రగ్బీ పిచ్‌పై

క్రికెట్‌లో రికార్డులు బ‌ద్ద‌లు కావ‌డం సాధార‌ణ‌మైన విష‌యం. అయితే.. ఒక్కోసారి కొన్ని రికార్డులు చాలా రోజుల వ‌ర‌కు నిలిచిపోతుంటాయి. తాజాగా అలాంటి రికార్డే ఇంగ్లాండ్‌-పాకిస్థాన్ ల మ‌ధ్య జ‌రిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న‌మోదు అయ్యింది. క్రికెట్ చ‌రిత్ర‌లోనే అతి భారీ సిక్స్ అది. ఇంగ్లాండ్ విధ్వంస‌క‌ర వీరుడు లియామ్ లివింగ్ స్టోన్ కొట్టిన ఓ సిక్స‌ర్ అది. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. పాకిస్థాన్ బౌలర్ హ్యారిస్ రౌఫ్ వేసిన 16వ ఓవర్ తొలి బంతిని లాంగాన్ దిశగా లివింగ్ స్టోన్ భారీ సిక్సర్ బాదాడు.

అతని బలానికి బంతి ఏకంగా మైదానం అవతల రగ్బీ పిచ్‌పై పడింది. దాదాపు ఆ సిక్స్ 125 ప్లస్ మీటర్లంట. ఈ సిక్స్‌ను ప్రపంచంలోనే అత్యంత భారీ సిక్సర్‌గా కామెంటేటర్స్‌తోపాటు అభిమానులు అభివర్ణిస్తున్నారు. 125 + మీటర్ల కంటే ఎక్కువ దూరంలో బంతి పడిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా.. ఈ సిక్స్‌‌ దూరాన్ని కచ్చితంగా చెప్పడం సాధ్యం కాలేదంట. ఇలాంటి సిక్స్‌ను ఇంతవరకు తాము చూడలేదని స్కై స్పోర్ట్స్‌లో కామెంటేటర్లుగా ఉన్న మాజీ క్రికెటర్లు ఇయాన్‌ వార్డ్‌, కుమార సంగక్కర మ్యాచ్‌ అనంతరం చెప్పారు. ఈ సిక్స్‌కు సంబంధించిన వీడియోను ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ట్విట‌ర్ ట్వీట్ చేయ‌గా.. నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.

ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై ఇంగ్లాండ్ 45 ప‌రుగుల‌ తేడాతో విజయం సాధించింది. దాంతో మూడు టీ20ల సిరీస్ 1-1తో సమమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్‌ నిర్ణీత ఓవర్లలో 200 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ జోస్ బట్లర్(59), మొయిన్ అలీ(36), లివింగ్ స్టోన్(38) రాణించారు. అనంతరం పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 159 పరుగులే చేసి ఓటమిపాలైంది. మహ్మద్ రిజ్వాన్(37), షాదాబ్ ఖాన్(36) టాప్ స్కోరర్లుగా నిలిచారు. మొయిన్ అలీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ల‌భించింది.

Next Story