పంత్ పేలవ ప్రదర్శన.. భారీ స్కోర్ దిశగా ఆస్ట్రేలియా
Labuschagne and Smith guide hosts to 166/2 at stumps.పంత్ పేలవ ప్రదర్శన.. భారీ స్కోర్ దిశగా ఆస్ట్రేలియా.
By తోట వంశీ కుమార్ Published on 7 Jan 2021 1:39 PM IST
సిడ్ని వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా భారీ స్కోర్ దిశగా దూసుకెలుతోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ రెండు వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. మార్నస్ లబుషేన్ 67 పరుగులు, స్టీవ్ స్మిత్ 31 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో నవదీప్ సైనీ, సిరాజ్ చెరో వికెట్ పడగొట్టారు.
అంతముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్‌కు శుభారంభం దక్కలేదు. 5 పరుగులు చేసిన ఓపెనర్ డేవిడ్ వార్నర్ ను మహ్మద్ సిరాజ్ పెవిలియన్ చేర్చాడు. దీంతో ఆసీస్ 6 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. తొలి టెస్ట్ ఆడుతున్న మరో ఓపెనర్ విల్ పకోస్కీ(62) కి లబుషేన్ జతకలిశాడు. తొలుత వీరిద్దరు వికెట్ కాపాడుకునేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. ఈ దశలో వర్షం అంతరాయం కలిగించింది. ఆట తిరిగి ప్రారంభం అయిన తరువాత ఇద్దరూ ధాటిగా ఆడారు. భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. రెండు సార్లు పంత్ క్యాచ్ జారవిడచడంతో బతికిపోయిన పకోస్కీ టెస్టుల్లో తొలి అర్థశతకం సాధించాడు. వీరిద్దరు రెండో వికెట్ కు శతక భాగస్వామ్యం నెలకొల్పాక.. సైనీ వీరి భాగస్వామ్యాన్ని విడగొట్టాడు. పకోస్కీని ఎల్బీగా వెనక్కి పంపాడు.
అనంతరం లబుషేన్‌కు స్టీవ్ స్మిత్ జతకలిశాడు. తొలి రెండు టెస్టుల్లో తక్కువ స్కోర్‌కే పరిమితం అయిన స్మిత్.. ఈ మ్యాచ్‌లో ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేశాడు. భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఐదు బౌండరీలు బాదాడు. స్మిత్ ధాటిగా బ్యాటింగ్ చేస్తుండగా.. లబుషేన్ అతడికి సహకారం అందించాడు.వీరిద్దరూ మరో వికెట్ పడకుండా తొలి రోజు ఆటను ముగించారు. అభేధ్యమైన మూడో వికెట్‌కు 60 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక రెండో రోజు భారత బౌలర్లు రాణించి వీరిద్దరిని ఎంత త్వరగా పెవిలియన్‌కు చేర్చుతారు అనేదానిపైనే ఆసీస్ స్కోర్ ఆధారపడి ఉంది.