కేకేఆర్‌తో మూడేళ్ల బంధాన్ని తెంచుకున్న ప్రధాన కోచ్..!

మూడుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన‌ కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జ‌ట్టు మూడు సీజన్ల తర్వాత ప్రధాన కోచ్ చంద్రకాంత్ పండిట్‌ను త‌ప్పించింది.

By Medi Samrat
Published on : 29 July 2025 9:15 PM IST

కేకేఆర్‌తో మూడేళ్ల బంధాన్ని తెంచుకున్న ప్రధాన కోచ్..!

మూడుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన‌ కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జ‌ట్టు మూడు సీజన్ల తర్వాత ప్రధాన కోచ్ చంద్రకాంత్ పండిట్‌ను త‌ప్పించింది. చంద్రకాంత్ పండిట్ 2022లో KKR ప్రధాన కోచ్ అయ్యాడు. అతని పర్యవేక్షణలో జట్టు 2024లో టైటిల్ గెలిచింది. చంద్రకాంత్ పండిట్ త‌ప్పుకుంటున్న విష‌యాన్ని ఫ్రాంచైజీ మంగళవారం ప్రకటించింది.

చంద్రకాంత్ పండిట్ కొత్త అవకాశాల కోసం వెతకాలని నిర్ణయించుకున్నారని, KKR ప్రధాన కోచ్‌గా కొనసాగడం లేదని ఫ్రాంచైజీ తెలిపింది. 2024లో KKRని టాటా IPL ఛాంపియన్‌గా చేయడంతో సహా అతని అమూల్యమైన సహకారానికి మేము కృతజ్ఞులం.. అతని నాయకత్వం, క్రమశిక్షణ జట్టుపై శాశ్వత ముద్ర వేసింది.. ఆయన భవిష్యత్తుకు మంచి జరగాలని కోరుకుంటున్నాం’’ అని పేర్కొంది.

పండిట్ నాయకత్వంలో KKR మూడు సీజన్లలో 42 మ్యాచ్‌లలో 22 గెలిచింది, 18 ఓడిపోయింది. రెండు మ్యాచ్‌లు అసంపూర్తిగా మిగిలిపోయాయి. అయితే.. గత సీజన్‌లో ఆ జట్టు 14 లీగ్ మ్యాచ్‌ల్లో ఐదు మాత్రమే గెలిచి ఎనిమిదో స్థానంలో నిలిచింది. పండిట్ స్థానం భర్తీని KKR ఇంకా ప్రకటించలేదు.

గౌతమ్ గంభీర్ 2024లో పండిట్‌తో కలిసి పనిచేశాడు. గత సీజన్‌లో డ్వేన్ బ్రావో అతనితో ప‌నిచేశాడు. పండిట్‌కు చాలా కఠినమైన కోచ్‌గా పేరుంది. ఆ కోచింగ్ శైలి కారణంగానే ఆయ‌న‌ను ఖదూస్ కోచ్ అని పిలుస్తారు.

దేశవాళీ క్రికెట్‌లో పండిట్‌కు చాలా పెద్ద పేరుంది. బలహీనమైనవిగా భావించే జట్లు కూడా అతని కోచింగ్‌లో గొప్ప విజయాలు సాధించాయి. అతని కోచింగ్‌లోనే విదర్భ 2018, 2019లో రంజీ ట్రోఫీ, ఇరానీ కప్ టైటిళ్లను గెలుచుకుంది. మధ్యప్రదేశ్ జట్టు 2022 సంవత్సరంలో అతడు కోచ్‌గా ఉన్న సమయంలో రంజీ ఛాంపియన్‌గా నిలిచింది.

Next Story