నాలుగు వరుస పరాజయాల తరువాత.. ఎట్టకేలకు
Kolkata Knight riders beat Punjab Kings by 5 wickets.ఎట్టకేలకు నాలుగు వరుస పరాజయాల అనంతరం కోల్ కతా నైట్ రైడర్స్
By తోట వంశీ కుమార్ Published on 27 April 2021 2:20 AM GMTఎట్టకేలకు నాలుగు వరుస పరాజయాల అనంతరం కోల్ కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా సారథి మోర్గాన్.. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో విజయాన్ని అందించాడు. దీంతో ఈ సీజన్‌లో రెండో విజయాన్ని నమోదు చేసిన నైట్ రైడర్స్.. పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపరచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 123 పరుగులు మాత్రమే చేయగలిగింది. మయాంక్ అగర్వాల్ (31; 34 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించగా... చివర్లో క్రిస్ జోర్డాన్ (30; 18 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడాడు. ప్రసిధ్ కృష్ణ (3/ 30), సునీల్ నరైన్ (2/22), కమిన్స్ (2/31) ప్రత్యర్థి భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నారు.
అనంతరం స్వల్ప లక్ష్యాన్ని చేధించడానికి బరిలోకి దిగిన కోల్‌కత్తాకు శుభారంభం దక్కలేదు. 17 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో జట్టును కెప్టెన్ మోర్గాన్ (47 నాటౌట్; 40 బంతుల్లో 4 ఫోర్లు , 2 సిక్స్‌లు), రాహుల్ త్రిపాఠి (41; 32 బంతుల్లో 7 ఫోర్లు) జట్టును ఆదుకున్నారు. వికెట్ కాపాడుకుంటూనే అవసరం ఉన్నప్పుడు బౌండరీలు బాదుతూ సాధించాల్సిన రన్‌రేట్‌ను పడిపోకుండా చూసుకున్నారు. నాలుగో వికెట్ కు 66 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన అనంతరం ఓ భారీ షాట్‌ను ఆడేందుకు యత్నించి త్రిపాఠి పెవిలియన్ కు చేరాడు. అయితే.. కెప్టెన్ మోర్గాన్.. రసెల్(10), కార్తీక్ (12 నాటౌట్)లతో కలిసి 16.4 ఓవర్లలోనే జట్టుకు విజయాన్ని అందించాడు.