బెంగళూరు ఢమాల్.. కోల్‌కతా ధనాధన్ షో
Kolkata beat Bangalore by 9 wickets.భారత్‌లో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)14వ సీజన్ తొలి అంచె పోటీల్లో
By తోట వంశీ కుమార్ Published on 21 Sep 2021 3:14 AM GMTభారత్‌లో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)14వ సీజన్ తొలి అంచె పోటీల్లో చక్కటి ప్రదర్శన కనబరిచింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. అయితే.. యూఏఈలో ప్రారంభమైన రెండో అంచె పోటీల్లో మాత్రం ఆ జట్టు తడబడింది. కోహ్లీ, డివిలియర్స్, మాక్స్‌వెల్ వంటి స్టార్ హిట్టర్లు ఉన్నా.. కనీసం వంద పరుగులు కూడా చేయలేక ఘోర పరాభవం చవిచూసింది. సోమవారం కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో 9 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.
టాస్ గెలిచిన కోహ్లీ మరో ఆలోచనే లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. స్టార్ హిట్టర్లు ఉండడంతో.. పరుగుల విందే అని అనుకున్నారంతా. అయితే.. రెండో ఓవర్లోనే కోహ్లి (5) ఔటయ్యాడు. పవర్‌ప్లేలో పడిక్కల్ పెవిలియన్(22) చేరాడు. 6 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు 41/2 స్కోరుతో నిలిచింది. ఏబీడీ, మాక్స్‌వెల్ ఉండడంతో.. కనీసం 150 పరుగులైనా చేస్తుందని అభిమానులు బావించారు. అయితే.. కోల్‌కతా బౌలర్లు రసెల్(3/9), వరుణ్ చక్రవర్తి (3/13) మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశారు. ఏ ఒక్క బ్యాట్స్ మెన్‌ను కుదురుకోనివ్వలేదు. వీరి ధాటికి.. భరత్ (16), డివిలియర్స్ (0), మ్యాక్స్‌వెల్ (10), హసరంగ (0) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. ఇక ఏ దశలోనూ బెంగళూరు కోలుకోలేదు. చివరికి 19 ఓవర్లలో 92 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
స్వల్ప లక్ష్యాన్ని కోల్‌కతా 10 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి చేదించింది. ఓపెనర్లు శుబ్‌మన్ గిల్ (34 బంతుల్లో 48; 6 ఫోర్లు, 1 సిక్స్), వెంకటేశ్ అయ్యర్ (27 బంతుల్లో 41 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగి ఆడారు. అద్భుతంగా బౌలింగ్ చేసిన వరుణ్‌కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది.