ఐసీసీ వ‌న్డే ర్యాంకింగ్స్‌.. టాప్‌-4లో ముగ్గురు మ‌నోళ్లే..!

ప్రపంచకప్ ముగిసిన తర్వాత ఐసీసీ ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది.

By Medi Samrat  Published on  22 Nov 2023 10:20 AM GMT
ఐసీసీ వ‌న్డే ర్యాంకింగ్స్‌.. టాప్‌-4లో ముగ్గురు మ‌నోళ్లే..!

ప్రపంచకప్ ముగిసిన తర్వాత ఐసీసీ ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఇందులో ఇండియాకు చెందిన ముగ్గురు బ్యాట్స్‌మెన్‌లు టాప్ ఫోర్‌లో ఉన్నారు. భారత దిగ్గజ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ అగ్రస్థానానికి చేరువయ్యాడు. రోహిత్ శర్మ తన స్థానాన్ని పటిష్టం చేసుకుని నాలుగో స్థానంలో నిలిచాడు. తొలి స్థానంలో టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్, రెండో స్థానంలో పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ బాబర్ అజామ్ ఉన్నారు. కాగా, కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు.

ప్రపంచకప్‌లో కోహ్లీ 765 పరుగులు చేశాడు. దీంతో ఒక్క స్థానం మెరుగుప‌రుచుకున్నాడు. కోహ్లీ టాప్ ర్యాంక్‌లో ఉన్న శుభ్‌మాన్ కంటే కేవలం 35 రేటింగ్ పాయింట్లు వెనుకబడి ఉన్నాడు. గిల్‌కి 826 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. బాబర్ ఆజం రెండో స్థానంలో ఉండ‌గా.. అత‌డి ఖాతాలో 824 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. కోహ్లీ 791, రోహిత్ శర్మ 769 రేటింగ్ పాయింట్లతో మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు. ప్రపంచకప్‌లో కోహ్లీ మూడు సెంచరీలు సాధించాడు. వన్డేల్లో అత్యధిక సెంచరీల(49 సెంచరీలు) సచిన్ టెండూల్కర్ రికార్డును కూడా బద్దలు కొట్టాడు. టోర్నీలో రోహిత్ శర్మ జట్టు తరపున 597 పరుగులు చేశాడు. శుభ్‌మన్ గిల్ 354 పరుగులు, బాబర్ ఆజం 320 పరుగులు చేశారు. ప్రపంచకప్ ఫైనల్‌లో సెంచ‌రీ చేసిన‌ ఆస్ట్రేలియా ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ ట్రావిస్ హెడ్ 28 స్థానాలు ఎగబాకి 15వ స్థానానికి చేరుకున్నాడు.

బౌలర్ల ర్యాంకింగ్స్‌లో దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. జోష్ హేజిల్‌వుడ్ నాలుగు స్థానాలు ఎగబాకి రెండో స్థానంలో.. మహ్మద్ సిరాజ్ మూడో స్థానంలో, జస్ప్రీత్ బుమ్రా నాలుగో స్థానంలో ఉన్నారు. కుల్దీప్ యాదవ్ ఒక స్థానం దిగజారి ఆరో స్థానానికి చేరుకున్నాడు.

ఆల్ రౌండర్ల వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్-10లో పెద్దగా మార్పు లేదు. బంగ్లాదేశ్‌కు చెందిన అనుభవజ్ఞుడైన షకీబ్ అల్ హసన్ అగ్రస్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్‌కు చెందిన మిచెల్ సాంట్నర్ రెండు స్థానాలు దిగజారి ఏడో స్థానానికి, బంగ్లాదేశ్‌కు చెందిన మెహదీ హసన్ మిరాజ్ రెండు స్థానాలు ఎగబాకి తొమ్మిదో స్థానానికి చేరుకున్నారు.

Next Story