మ్యాచ్ లో గొడవ.. గంభీర్, కోహ్లీకి భారీ ఫైన్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు లక్నో సూపర్ జెయింట్స్ పై 18 పరుగుల తేడాతో విజయం సాధించింది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  2 May 2023 11:30 AM IST
Kohli, Gambhir, LSG, RCB, IPL 2023

మ్యాచ్ లో గొడవ.. గంభీర్, కోహ్లీకి భారీ ఫైన్ 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు లక్నో సూపర్ జెయింట్స్ పై 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. లక్నోలోని అటల్ బిహారీ వాజ్ పేయి ఏకానా స్టేడియంలో ఆర్సీబీ 20 ఓవర్లలో 9 వికెట్లకు 126 పరుగులు చేసింది. లక్నో కేవలం 108 పరుగులు చేసి మాత్రమే ఆలౌట్ అయింది. లక్నో బ్యాట్స్మెన్ ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. ఆర్సీబీ బౌలర్లలో హేజెల్ వుడ్ 2, కర్ణ్ శర్మ 2, సిరాజ్ 1, మ్యాక్స్ వెల్ 1, హసరంగ 1, హర్షల్ పటేల్ 1 వికెట్ తీశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 9 వికెట్లకు 126 పరుగులు మాత్రమే చేసింది. కెప్టెన్ డుప్లెసిస్ 44 పరుగులు చేయగా, విరాట్ కోహ్లీ 31 పరుగులు చేశాడు. వీరిద్దరూ తొలి వికెట్ కు 62 పరుగులు జోడించినా, పిచ్ ప్రభావంతో వికెట్లు టపటపా పడ్డాయి. మిడిలార్డర్ లో దినేశ్ కార్తీక్ 16 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. మ్యాక్స్ వెల్ (6), అనూజ్ రావత్ (9), సుయాశ్ ప్రభుదేశాయ్ (6) విఫలమయ్యారు. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో నవీన్ ఉల్ హక్ 3, రవి బిష్ణోయ్ 2, అమిత్ మిశ్రా 2, కృష్ణప్ప గౌతమ్ 1 వికెట్ తీశారు.

ఈ మ్యాచ్ అనంతరం.. గౌతమ్ గంభీర్-విరాట్ కోహ్లీలు మైదానంలో గొడవపడ్డారు. మ్యాచ్ ముగిసిన వెంటనే ఇరు జట్లు సంప్రదాయ షేక్ హ్యాండ్ ను ఇచ్చుకున్నాయి. ఆ సమయంలో లక్నో కు ఆడుతున్న ఆఫ్ఘన్ బౌలర్ నవీన్ షేక్ హ్యాండ్ ఇచ్చే సమయంలో మాటా మాటా అనుకున్నారు. ఆ తర్వాత కైల్ మేయర్స్-విరాట్ కోహ్లీ మాట్లాడుతూ ఉండగా, గంభీర్ వచ్చి మేయర్స్ ను పట్టుకుని వెళ్ళిపోయాడు. గంభీర్- విరాట్ కోహ్లి మధ్య మరోసారి మాటల యుద్ధం సాగింది. కేఎల్ రాహుల్ సహా ఇతర ఆటగాళ్లు, సహాయక సిబ్బంది గంభీర్-కోహ్లీ ఇద్దరినీ విడదీశారు.

గంభీర్ IPL ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.21 ప్రకారం లెవల్ 2 నేరాన్ని అంగీకరించారు. దీంతో అతని మ్యాచ్ ఫీజులో 100 శాతం జరిమానా విధించినట్లు ఐపీఎల్ నిర్వాహకులు తెలిపారు. అదేవిధంగా, కోహ్లీ కూడా IPL ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.21 ప్రకారం లెవల్ 2 నేరాన్ని అంగీకరించడంతో అతని మ్యాచ్ ఫీజులో 100 శాతం జరిమానా విధించినట్లు తెలిపారు. నవీన్-ఉల్-హక్ మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించారు.

Next Story