ఐపీఎల్ ను వీడుతున్న ఆటగాళ్లు.. డేవిడ్ హస్సీ కీలక వ్యాఖ్యలు
KKR mentor David Hussey opens up on grave COVID-19 situation in India. పలువురు ఆటగాళ్లు ఐపీఎల్ ను ఆడకుండా వెళ్లిపోవాలని అనుకుంటూ ఉన్నారు.
By Medi Samrat Published on 26 April 2021 5:21 PM ISTభారతదేశంలో ఓ వైపు కరోనా ఉధృతి కొనసాగుతూ ఉన్నా.. మరో వైపు ఐపీఎల్ ను నిర్వహిస్తూ ఉన్నారు. భారత్ లోని పలు నగరాలలో ఐపీఎల్ ను నిర్వహిస్తూ ఉన్నారు. పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా ఐపీఎల్ ఆడుతున్న విదేశీ ఆటగాళ్లకు కొత్త టెన్షన్ మొదలైంది. దీంతో పలువురు ఆటగాళ్లు ఐపీఎల్ ను ఆడకుండా వెళ్లిపోవాలని అనుకుంటూ ఉన్నారు. బయో బబుల్ నిబంధనల నడుమ ఈ మెగా ఈవెంట్ కొనసాగుతోంది. కానీ కొంతమంది విదేశీ ఆటగాళ్లు స్వదేశానికి పయనమవుతున్నారు. ఆస్ట్రేలియా క్రికెటర్లు ఆండ్రూ టై(రాజస్తాన్ రాయల్స్), ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆడం జంపా, కేన్ రిచర్డ్‌సన్ ఆస్ట్రేలియాకు వెళ్లాలని డిసైడ్ అయిన సంగతి తెలిసిందే..!
క్రికెట్ ఆస్ట్రేలియా స్పందిస్తూ ఐపీఎల్-2021 ఆడుతున్న తమ క్రికెటర్లు, కోచ్‌లు, కామెకంటేటర్లతో టచ్‌లో ఉన్నామని తెలిపారు. భారత్‌లో కరోనా వ్యాప్తి ఉధృతమవుతోందని, ఇలాంటి కష్ట సమయంలో తాము భారతీయులకు మద్దతుగా నిలబడతామని, అయితే ఆస్ట్రేలియా ప్రభుత్వ సూచనల మేరకు తమ క్రికెటర్లను వెనక్కి పిలిపించే అవకాశాలను పరిశీలిస్తామని స్పష్టం చేసింది. స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, పాట్ కమిన్స్, గ్లెన్ మాక్స్‌వెల్, నాథన్ కౌల్టర్ నైల్ తో పాటూ 14 మంది ఆసీస్ క్రికెటర్లు ఐపీఎల్ ఆడుతున్నారు. ఇప్పటికే ముగ్గురు ఆటగాళ్లు స్వదేశానికి వెళ్లిపోయారు.
ఈ పరిణామాలపై కోల్ కతా నైట్ రైడర్స్ మెంటర్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ హస్సీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ లో ఆడుతున్న ఆసిస్ క్రికెటర్లు ఒత్తిడికి గురవున్నారని... ఐపీఎల్ ముగిసిన తర్వాత తమ దేశానికి తిరిగి వెళ్లగలమా? అని ఆందోళన చెందుతున్నారని అన్నారు. ప్రస్తుతం తామంతా బబుల్ లో ఉంటున్నామని.. ప్రతి రెండో రోజు తమకు కోవిడ్ టెస్టులను నిర్వహిస్తున్నారని చెప్పారు. ఆటగాళ్ల రక్షణ కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని.. ఎంతో మంది కరోనా పేషెంట్ల ఆసుపత్రుల బెడ్లపై ఉన్నారనే వార్తలు ప్రతి క్షణం మీడియాలో చూస్తున్నామని చెప్పారు. విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను ఎంటర్టైన్ చేస్తున్నందుకు సంతోషంగా ఉందని అందరూ అనుకున్నామని తెలిపారు. టోర్నమెంట్ విజయవంతంగా ముందుకు సాగాలని ఆటగాళ్లంతా ఆకాంక్షించారని.. అయితే, టోర్నమెంట్ ముగిసిన తర్వాత స్వదేశానికి ఎలా వెళ్లాలనే దానిపైనే అందరూ ఆందోళన వ్యక్తం చేశారని తెలిపారు.