నా బౌలింగ్‌లో ఆరు ఫోర్లు కొడ‌తావా.. పృథ్వీపై ప్ర‌తీకారం తీర్చుకున్న మావీ

KKR bowler Shivam mavi takes revenge on prithvi shaw.నా ఓవ‌ర్‌లోనే ఆరు ఫోర్లు కొడ‌తావా అంటూ.. స‌ర‌దాగా పృథ్వి మెడను గ‌ట్టిగా ప‌ట్టుకున్నాడు మావి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 April 2021 4:52 AM GMT
Shivam Mavi

అహ్మదాబాద్ వేదిక‌గా నిన్న కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ తో జ‌రిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జ‌ట్టు 7 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఢిల్లీ జ‌ట్టు ఓపెన‌ర్ పృథ్వీ షా చెల‌రేగి ఆడాడు. కేవ‌లం 41 బంతుల్లోనే 11 పోర్లు, 3 సిక్స‌ర్ల‌తో 82 ప‌రుగులు చేశాడు. భారీ ల‌క్ష్యాన్ని చేధించ‌డానికి బ‌రిలోకి దిగిన తొలి ఓవ‌ర్‌లోనే పృథ్వీ షా రెచ్చిపోయాడు. శివ‌మ్ మావి వేసిన ఈ ఓవ‌ర్‌లో పృథ్వీ వ‌రుస‌గా ఆరు పోర్లు కొట్టాడు. తొలి బంతి వైడ్ వేయ‌గా.. మొత్తంగా ఈ ఓవ‌ర్‌లో 25 ప‌రుగులు వ‌చ్చాయి. ఐపీఎల్‌లో ఒకే ఓవ‌ర్‌లో ఆరు పోర్లు కొట్టిన రెండో బ్యాట్స్‌మెన్ గా పృథ్వీ నిలిచాడు. గ‌తంలో ర‌హానే ఈఘ‌న‌త సాధించాడు.

పృథ్వీ చెల‌రేగ‌డంతో ఢిల్లీ ఈజీగానే గెలిచింది. తొలి ఓవ‌ర్ త‌రువాత కోల్‌క‌తా కెప్టెన్ మోర్గాన్.. శివ‌మ్ మావికి మ‌రో ఓవ‌ర్ ఇవ్వ‌లేదు. ఇక మ్యాచ్ ముగిసిన అనంత‌రం ఇరు జ‌ట్ల ఆట‌గాళ్లు క‌ర‌చాల‌నం చేసే క్ర‌మంలో పృథ్వీపై మావి ప్ర‌తీకారం తీర్చుకున్నాడు. నా ఓవ‌ర్‌లోనే ఆరు ఫోర్లు కొడ‌తావా అంటూ.. స‌ర‌దాగా పృథ్వి మెడను గ‌ట్టిగా ప‌ట్టుకున్నాడు మావి. ఇందుకు సంబంధించిన వీడియోను ఐపీఎల్ ట్విట్ట‌ర్‌లో అభిమానుల‌తో పంచుకుంది. 'మ్యాచ్ ముగిసింది.. ఫ్రెండ్‌షిప్ మొదలైంది. ఐపీఎల్ గొప్పతనం ఇదే'' అని క్యాప్షన్ తగిలించింది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇంకెందుకు ఆల‌స్యం మీరు ఓ సారి వీడియో చూసేయండి.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా ఇన్నింగ్స్‌లో ఆరంభంలో ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (38 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 43) నిలకడగా ఆడగా.. మిడిలార్డర్‌ మాత్రం దారుణంగా తడబడింది. చివర్లో రస్సెల్‌(27 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 45 నాటౌట్‌) మెరుపులతో జట్టు కాస్త గౌరవప్రదమైన స్కోరు అందుకుంది. కేకేఆర్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులు చేయగలిగింది. ఢిల్లీ బౌల‌ర్ల‌లో అక్షర్‌, లలిత్‌ యాదవ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి.ఆ తర్వాత ల‌క్ష్య‌ఛేదనకు దిగిన‌ ఢిల్లీ 16.3 ఓవర్లలో 3 వికెట్లకు 156 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్‌ పృథ్వీ షా(41 బంతుల్లో 11ఫోర్లు, 3 సిక్స‌ర్ల‌తో 82) ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లోనే పేసర్‌ శివమ్‌ మావికి చుక్కలు చూపించాడు.

తొలి ఓవ‌ర్‌ ఆరు బంతులను 4,4,4,4,4,4 బౌండ‌రీల‌కు త‌ర‌లించి త‌న దూకుడును ప్ర‌ద‌ర్శించాడు. మ‌రో ఓపెన‌ర్ శిఖ‌ర్ ధావ‌న్(47 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 46) కూడా రాణించ‌డంతో ఢిల్లీ 16.3వ ఓవర్‌లోనే మ్యాచ్‌ను ముగించింది. ఓపెన‌ర్లు తొలి వికెట్‌కు 132 పరుగుల భారీ భాగస్వామ్యం న‌మోదు చేశారు. 14వ ఓవర్ నుండి కేకేఆర్ బౌల‌ర్‌ క‌మిన్స్ మూడు వికెట్లు తీసి దూకుడు పెంచినా.. అప్ప‌టికే జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది. ఈ విజ‌యంతో ఢిల్లీ క్యాపిట‌ల్స్ పాయింట్ల ప‌ట్టిక‌లో రెండో స్థానానికి ఎగ‌బాకింది.


Next Story