వెంకటేశ్‌ అయ్యర్‌, రాహుల్‌ త్రిపాఠి మెరుపులు.. చిత్తైన ముంబై

KKR beat Mumbai Indians by 7 wickets.డిఫెండింగ్ ఛాంపియ‌న్‌ ముంబై ఇండియ‌న్స్ పై కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ ఘ‌న

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Sep 2021 3:13 AM GMT
వెంకటేశ్‌ అయ్యర్‌, రాహుల్‌ త్రిపాఠి మెరుపులు.. చిత్తైన ముంబై

డిఫెండింగ్ ఛాంపియ‌న్‌ ముంబై ఇండియ‌న్స్ పై కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ ఘ‌న విజ‌యాన్ని సాధించింది. ముంబై నిర్దేశించిన 156 ప‌రుగుల ల‌క్ష్యాన్ని కేవ‌లం 15.1 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి చేదించింది. ఓపెన‌ర్ వెంకటేశ్‌ అయ్యర్‌ (30 బంతుల్లో 53; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), రాహుల్‌ త్రిపాఠి (42 బంతుల్లో 74 నాటౌట్‌; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) లు పోటాపోటిగా ప‌రుగులు చేయ‌డంతో గురువారం ఏక‌ప‌క్షంగా సాగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో కోల్‌క‌తా ఘ‌న విజ‌యాన్నిసొంతం చేసుకుంది. ఈ విజ‌యంతో కోల్‌క‌తా పాయింట్ల ప‌ట్టిక‌లో నాలుగో స్థానానికి చేరుకుంది.

తొలుత టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల న‌ష్టానికి 155 పరుగులు చేసింది. ఓపెన‌ర్లు క్వింటన్‌ డికాక్‌ (55; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (33) మంచి ఆరంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు 78 ప‌రుగులు జోడించారు. అయితే.. మిడిల్ ఆర్డ‌ర్ త‌డ‌బ‌డింది. సూర్య‌కుమార్ యాద‌వ్‌(5), ఇషాన్ కిష‌న్‌(14), పొలార్డ్‌(21), కృనాల్ పాండ్య (12) త‌క్కువ ప‌రుగులే పెవిలియ‌న్ చేరారు. దీంతో ముంబై 155 ప‌రుగ‌ల‌కే ప‌రిమితం అయ్యింది. కోల్‌కతా బౌలర్లలో ఫెర్గూసన్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

లక్ష్యఛేదనలో కోల్‌కతాకు అదిరిపోయే ఆరంభం లభించింది. కొత్త సంచ‌ల‌నం వెంకటేశ్‌ అయ్యర్ ధ‌నాధ‌న్ బ్యాటింగ్‌తో స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించాడు. మూడు ఓవ‌ర్లు పూర్తి అయ్యే స‌రికి నైట్‌రైడ‌ర్స్ 40 ప‌రుగులు చేసింది. శుభ్‌మన్‌ గిల్‌ (13; 1 ఫోర్‌, 1 సిక్స్‌) ఔటైనా.. అగ్నికి వాయువు తోడు అయిన‌ట్లు వెంక‌టేష్‌కు రాహుల్ త్రిపాఠి జ‌త క‌లిసాడు. వీరిద్ద‌రు ముంబై బౌల‌ర్ల‌ను ఏమాత్రం లెక్క‌చేయ‌లేదు. ఎడా పెడా బౌండ‌రీలు బాదుతూ ల‌క్ష్యాన్ని వేగంగా క‌రిగించ‌సాగారు. ఈ క్రమంలో 25 బంతుల్లో తొలి ఐపీఎల్‌ హాఫ్‌ సెంచరీ తన పేరిట రాసుకున్న వెంకటేశ్‌ను బుమ్రా ఔట్ చేసిన‌ప్ప‌టికి.. మ‌రో ఎండ్‌లో ఉన్న త్రిపాఠి ధాటిగా బ్యాటింగ్ కొన‌సాగించాడు. త్రిపాఠి 29 బంతుల్లో అర్థ‌శ‌త‌కం పూర్తి చేసుకున్నాడు. మోర్గాన్‌ (7) ఎక్కువసేపు నిలువలేకపోయినా త్రిపాఠి మిగిలిన ప‌నిని పూర్తి చేశాడు.

Next Story
Share it