ఫైన‌ల్‌కు కోల్‌క‌తా.. ఆశ‌ల్లేని మ్యాచ్‌లో ఢిల్లీ అద్భుత పోరాటం

KKR Beat Delhi Capitals In Nail Biting Finish.యువ‌కుల‌తో కూడిన ఢిల్లీ క్యాపిటల్స్‌ గ‌త మూడేళ్లుగా అంచ‌నాల‌కు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 Oct 2021 1:44 AM GMT
ఫైన‌ల్‌కు కోల్‌క‌తా.. ఆశ‌ల్లేని మ్యాచ్‌లో ఢిల్లీ అద్భుత పోరాటం

యువ‌కుల‌తో కూడిన ఢిల్లీ క్యాపిటల్స్‌ గ‌త మూడేళ్లుగా అంచ‌నాల‌కు మించి రాణిస్తోంది. లీగ్ ద‌శ‌లో అద‌ర‌గొట్టి.. కీల‌క‌మైన క్వాలిఫైయ‌ర్‌లో తేలిపోవ‌డం ఆ జ‌ట్టుకు అల‌వాటుగా మారింది. ఈ సారి కూడా గ్రూప్ ద‌శలో టేబుల్ టాప‌ర్‌గా నిలిచిన ఆ జ‌ట్టు తొలి క్వాలియ‌ర్ చెన్నై చేతిలో, రెండో క్వాలిఫ‌య‌ర్‌లో కోల్‌క‌తా చేతిలో ఓట‌మి పాలైంది. దీంతో తొలి సారి టైటిల్ అందుకోవాల‌న్న ఢిల్లీ ఆశ ఆడియాశే అయ్యింది. తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో చేజేతులా మ్యాచ్‌ను చేజార్చుకున్న ఢిల్లీ.. రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో చివ‌రి కంటా పోరాడింది. ఓ ద‌శ‌లో కోల్‌క‌తా ఈజీగా విజ‌యం సాధించేలా క‌నిపించింది. చేతిలో 9 వికెట్లు ఉండగా 25 బంతుల్లో 13 పరుగులు చేస్తే చాలు. ఇక్క‌డే ఢిల్లీ త‌మ శ‌క్తిమేర పోరాడింది. 7 పరుగుల వ్యవధిలో 6 వికెట్లు ప‌డ‌గొట్టింది. 23 బంతుల్లో 7 పరుగులే ఇచ్చింది. చివ‌రి ఓవ‌ర్‌కి 7 ప‌రుగులే కావాలి. ఏదో అద్భుతం ఢిల్లీ చేస్తుందా అని పించింది. అందుకు త‌గ్గ‌ట్లే తొలి నాలుగు బంతుల్లో ఒక్క ప‌రుగు మాత్ర‌మే ఇచ్చి రెండు వికెట్లు ప‌డ‌గొట్టింది. అయితే.. ఐదో బంతికి క‌థ అడ్డంతిరిగింది. త్రిపాఠి సిక్స్ బాది.. కోల్‌క‌తాకు విజ‌యాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఓడిన‌ప్ప‌టికి .. పోరాటం అద్భుత‌హ అనే చెప్పాలి. ఇక మూడు సార్లు ఛాంపియ‌న్ అయిన చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో రెండు సార్లు ఛాంపియ‌న్ అయిన కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ మ‌ధ్య శుక్ర‌వారం ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ ఏడాది కూడా కొత్త ఛాంపియ‌న్ లేన‌ట్లే.

ముందుగా టాస్ ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ చేసింది. శిఖర్‌ ధావన్‌ (39 బంతుల్లో 36; 1 ఫోర్, 2 సిక్సర్లు), శ్రేయస్‌ అయ్యర్‌ (27 బంతుల్లో 30 నాటౌట్‌; 1 ఫోర్, 1 సిక్స్‌) లు రాణించ‌డంతో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. పృథ్వీ షా(18), స్టాయినిస్‌(18), పంత్‌(6), హెట్‌మైయ‌ర్‌(17)లు దారుణంగా విఫ‌లం అయ్యారు. కోల్‌క‌తా బౌల‌ర్లు క‌ట్టుదిట్టంగా బంతులు వేయ‌డంతో ప‌రుగులు చేసేందుకు ఢిల్లీ బ్యాట్స్‌మెన్లు చెమ‌టోడ్చాల్సి వ‌చ్చింది. ఏ ద‌శలోనే ఢిల్లీ బ్యాట్స్‌మెన్లను స్వేచ్చ‌గా బ్యాటింగ్ చేసేందుకు కోల్‌క‌తా బౌల‌ర్లు అవ‌కాశం ఇవ్వ‌లేదు. దీంతో ఓ మోస్తారు ల‌క్ష్యాన్నే ఢిల్లీ నిర్ధేశించ‌క‌లిగింది.

అనంతరం 136 పరుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన కోల్‌క‌తాకు ఓపెన‌ర్లు శుభారంభం అందించారు. శుబ్‌మన్‌ గిల్‌ (46 బంతుల్లో 46; 1 ఫోర్, 1 సిక్స్‌), వెంకటేశ్‌ అయ్యర్‌ (41 బంతుల్లో 55; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) లు తొలి వికెట్‌కు 96 ప‌రుగులు జోడించి బ‌ల‌మైన పునాది వేశారు. వీరి జోరు చూస్తుంటే.. చాలా బంతులు ఉండ‌గానే మ్యాచ్ గెలిచేలా క‌నిపించింది. తొలి వికెట్ ప‌డ‌గొట్టిన అనంత‌రం ఢిల్లీ బౌల‌ర్లు పుంజుకున్నారు. 16 ఓవ‌ర్ చివ‌రి బంతికి రాణా ఔట్ కావ‌డంతో మ్యాచ్ స్వ‌రూపం మారిపోయింది. 4 ఓవ‌ర్ల‌లో 13 ప‌రుగులు చేస్తే చాలు. ఇక్కడ నుంచి ఢిల్లీ బౌల‌ర్లు ప‌ట్టువ‌ద‌ల‌కుండా బౌలింగ్ చేసి జ‌ట్టును మ‌ళ్లీ పోటిలోకి తెచ్చారు. త‌రువాతి మూడు ఓవ‌ర్ల‌లో అవేశ్ ఖాన్‌, ర‌బాడ, నార్జ్‌లు ఆరు ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి గిల్‌, కార్తీక్‌(0), మోర్గాన్‌(0) ల‌ను పెవిలియ‌న్ చేర్చారు. పేస‌ర్ల కోటా పూర్తి కావ‌డంతో చివ‌రి ఓవ‌ర్‌ను అశ్విన్‌తో వేయించాడు పంత్. తొలి రెండు బంతుల్లో ఒక్క ప‌రుగు మాత్ర‌మే ఇచ్చిన అశ్విన్‌.. మూడో బంతికి ష‌కిబ్‌(0), నాలుగో బంతికి న‌రైన్‌(0) వికెట్ల‌ను ప‌డ‌గొట్ట‌డంతో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. కోల్‌క‌తా విజ‌యానికి రెండు బంతుల్లో 6 ప‌రుగులు చేయాలి. ఐదో బంతిని అశ్విన్ మ‌రీ షార్ట్ వేయ‌గా.. త్రిపాఠి త‌న బ‌లాన్ని అంతా ఉప‌యోగించి లాంగాఫ్‌లో సిక్స్ బాదాడు. దీంతో కోల్‌క‌తా సంబ‌రాల్లో తేల‌గా.. ఢిల్లీ విషాదంలో మునిగింది.

Next Story