ప్రతీకారం తీర్చుకున్న కోల్‌క‌తా.. చెన్నై పై విజ‌యం

KKR beat CSK by six wickets in IPL 2022.కెప్టెన్సీని వ‌దిలి పెట్టిన ధోని బ్యాటుతో అద‌ర‌గొట్టినా.. ఇండియ‌న్ ప్రీమియ‌ర్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 March 2022 10:05 AM IST
ప్రతీకారం తీర్చుకున్న కోల్‌క‌తా.. చెన్నై పై విజ‌యం

కెప్టెన్సీని వ‌దిలి పెట్టిన ధోని బ్యాటుతో అద‌ర‌గొట్టినా.. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 15వ సీజ‌న్‌ను చెన్నై సూప‌ర్ కింగ్స్‌ ఓట‌మితో మొద‌లుపెట్టింది. ఆల్‌రౌండ‌ర్ ప్ర‌ద‌ర్శ‌న‌తో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ ఘ‌నంగా బోణీ కొట్టింది. రెండేళ్ల త‌రువాత స్వదేశంలో ప్రేక్షకుల మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో భారీ స్కోర్లు న‌మోదు కాకున్నా.. ఓ మంచి మ్యాచ్‌ను చూసిన అనుభూతి అభిమానుల‌కు క‌లిగింది. 6 వికెట్ల‌తో చెన్నైపై విజ‌యం సాధించిన కోల్‌క‌తా.. గ‌తేడాది ఫైన‌ల్‌లో ఓట‌మికి ప్ర‌తీకారం తీర్చుకుంది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 131 ప‌రుగులే చేసింది. కోల్‌క‌తా బౌల‌ర్లు క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేయ‌డంతో రుతురాజ్‌ గైక్వాడ్‌ (0), కాన్వే (3), అంబటి రాయుడు (15), శివమ్‌ దూబే (3), ఉతప్ప‌(28) త‌క్కువ స్కోర్ల‌కే పెవిలియ‌న్ చేర‌డంతో 17 ఓవ‌ర్లు ముగిసే స‌రికి చెన్నై 84/5తో నిలిచింది. ఈ ద‌శ‌లో చెన్నై క‌నీసం 120 ప‌రుగులైనా చేస్తుందా అని.. అనిపించిన త‌రుణం ఇది. అయితే.. కిష్ట ప‌రిస్థితుల్లో మ‌హేంద్ర సింగ్ ధోని (50 నాటౌట్; 38 బంతుల్లో 7పోర్లు, 1 సిక్స్‌) అదిరే అర్థ‌శ‌త‌కంతో రాణించాడు. కొత్త కెప్టెన్ జ‌డేజా( 26 నాటౌట్; 28 బంతుల్లో 1సిక్స్‌) చివ‌రి వ‌ర‌కు క్రీజులో ఉన్నా.. స్వేచ్చ‌గా బ్యాట్ ఝుళిపించ‌లేక‌పోయాడు. ధోని బాదుడుతో చెన్నై ఆఖరి మూడు ఓవర్లలో 47 పరుగులు సాధించింది. మూడేళ్ల త‌రువాత ఐపీఎల్‌లో ధోనికి ఇదే తొలి అర్థ‌శ‌త‌కం కావ‌డం గ‌మ‌నార్హం. కోల్‌కతా బౌలర్లలో ఉమేశ్‌ యాదవ్‌ రెండు వికెట్లు పడగొట్టాడు.

అనంతరం ల‌క్ష్యాన్ని కోల్‌క‌తా నైట్‌రైడర్స్‌ 18.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది. అజింక్యా రహానే (44; 34 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌), సామ్ బిల్లింగ్స్‌(25; 22 బంతుల్లో 1పోర్‌, 1 సిక్స్‌), కెప్టెన్ శ్రేయాస్ అయ్య‌ర్‌(20 నాటౌట్) రాణించ‌డంతో ల‌క్ష్య చేధ‌న‌లో కోల్‌క‌తాకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. చెన్నై బౌలర్లలో బ్రేవో మూడు వికెట్లు పడగొట్టాడు. ఉమేశ్‌ యాదవ్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డు లభించింది.

ఇక ఈ రోజు డ‌బుల్ హెడ‌ర్ మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. తొలుత‌ ఢిల్లీ క్యాపిటల్స్‌తో ముంబై ఇండియన్స్‌, ఆ త‌రువాత పంజాబ్‌ కింగ్స్‌తో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తలపడనున్నాయి.

Next Story