Kings XI Punjab Team Name Changed. ఇప్పటి వరకూ టైటిల్ నెగ్గని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు.. వచ్చే ఐపీఎల్ సీజన్‌కు కొత్త పేరుతో బరిలోకి దిగనుంది.
By Medi Samrat Published on 16 Feb 2021 4:25 AM GMT
ఐపీఎల్-2008 ప్రారంభం నుండి టోర్నీలో ఉన్నా ఇప్పటి వరకూ టైటిల్ నెగ్గని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు.. వచ్చే ఐపీఎల్ సీజన్‌కు కొత్త పేరుతో బరిలోకి దిగనుంది. ఈ మేరకు తమ జట్టును ఇక నుంచి పంజాబ్ కింగ్స్ పేరుతో పిలవాలని.. పేరులో మార్పును కోరుతూ బీసీసీఐకి దరఖాస్తు చేసుకున్నామని ఆ ఫ్రాంచైజీ తెలిపింది. ఐపీఎల్-14వ సీజన్‌లో కొత్త పేరుతో బరిలోకి దిగనున్న పంజాబ్‌ను.. ఈ సారైనా లక్ వరిస్తుందో చూడాలి మరి.
టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ సారధ్యంలోని పంజాబ్ జట్టు గతేడాది సీజన్‌లో ఆరో స్థానంలో నిలిచింది. కెప్టెన్‌గా రాహుల్ 675 పరుగులతో టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచి ఆరెంజ్ క్యాప్ అందుకున్నా.. మిగతా ఆటగాళ్లు ఆశించిన స్థాయిలో రాణించలేదు. మయాంక్ అడపాదడపా పర్వాలేదనిపించినా.. ముఖ్యంగా రూ.10 కోట్లు పెట్టి కొన్న ఆసీస్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ తీవ్రంగా నిరాశపరిచాడు. దీంతో ఈ సారి మ్యాక్స్‌వెల్‌ను వదులుకుంది పంజాబ్ ఫ్రాంచైజీ.
ఇదిలావుంటే.. ఫిబ్రవరి 18న జరగనున్న ఐపీఎల్ మినీ వేలానికి పంజాబ్ జట్టు రూ.53.2 కోట్లతో వేలంలో పాల్గొననుంది. అయితే బీసీసీఐ సవరించిన తాజా నిబంధనల ప్రకారం.. పంజాబ్ ఫ్రాంచైజీ పర్స్‌లో 75 శాతం ఆటగాళ్ల కొనుగోలుకు ఖర్చు చేయాల్సి ఉంటుందని తెలిపింది. మొత్తం తొమ్మిది స్లాట్స్ ఖాళీగా ఉండగా.. అందులో ఐదు స్లాట్స్‌ను విదేశీ ఆటగాళ్లతో భర్తీ చేయనున్నారు.