పొలార్డ్ అరుదైన ఘ‌న‌త‌.. ఒకే ఓవ‌ర్లో ఆరు సిక్స‌ర్లు

Kieron Pollard hits six sixes in an over off hat-trick man Akila Dananjaya.వెస్టిండీస్ భారీ హిట్ట‌ర్ కీర‌న్ పోలార్డ్, ఒకే ఓవ‌ర్లో ఆరు సిక్స‌ర్లు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 March 2021 5:51 AM GMT
Kieron Pollard hits six sixes in an over

వెస్టిండీస్ భారీ హిట్ట‌ర్ కీర‌న్ పోలార్డ్ సిక్స‌ర్ల‌తో విధ్వంసం సృష్టించాడు. శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా బుధవారం ఆంటిగ్వాలో జరిగిన తొలి టీ20లో పోలార్డ్ ఒకే ఓవర్లో ఆరు సిక్సులు బాదాడు. ఫలితంగా అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకే ఓవర్లో ఆరు సిక్సులు బాదిన మూడో బ్యాట్స్‌మన్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. ద‌క్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్‌మెన్ గిబ్స్ , టీమ్ఇండియా మాజీ ఆల్‌రౌండ‌ర్ యువ‌రాజ్ సింగ్ ‌ల త‌రువాత పోలార్డ్ ఆ ఘ‌న‌త సాధించాడు. లంక బౌల‌ర్ అఖిల ధ‌నంజ‌య వేసిన ఓవ‌ర్‌లో పొలార్డ్.. ఓవ‌ర్‌లోని ఆరు బంతుల‌కు ఆరు సిక్స‌ర్లు బాదాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ ఓడి శ్రీలంక జ‌ట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 131 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్ నిరోషన్ డిక్వెల్లా (33: 29 బంతుల్లో 3పోర్లు, ఒక సిక్స్‌), పతుమ్ నిశాంక (39: 34 బంతుల్లో 4 పోర్లు, ఒక సిక్స్‌) మాత్రమే రాణించ‌గా మిగ‌తావారు దారుణంగా విఫ‌ల‌మ‌య్యారు. గుణతిలక (4), చండిమాల్ (11), మాథ్యూస్ (5), పెరీరా (1) పూర్తిగా విఫ‌లమయ్యారు. లక్ష్యఛేదనలో వెస్టిండీస్‌కి ఓపెనర్లు సిమన్స్ (26: 15 బంతుల్లో 3పోర్లు, 2సిక్స్‌లు), ఎవిన్ లెవిస్ (28: 10 బంతుల్లో 2పోర్లు, 3సిక్స్‌లు) మెరుపు ఆరంభం ఇచ్చారు. అయితే ఇన్నింగ్స్ 4వ ఓవర్ వేసిన స్పిన్నర్ అఖిల ధనంజయ హ్యాట్రిక్ తీశాడు. లెవిస్, క్రిస్ ‌గేల్ (0), నికోలస్ పూరన్ (0)లను ఔట్ చేశాడు.


ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన కీరన్ పొలార్డ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ధనంజయ వేసిన ఆరో ఓవర్లో వరుసగా 6, 6, 6, 6, 6, 6 బాదేశాడు. ఆ త‌రువాతి ఓవ‌ర్‌లోనే హ‌స‌రంగా బౌలింగ్‌లో పొలార్డ్ ఔట్ అయ్యాడు. పొలార్డ్ 11 బంతుల్లో 38 రన్స్ చేశాడు. చివ‌ర‌ల్లో జేస‌న్ హోల్డ‌ర్‌(29: 24 బంతుల్లో 1పోర్, 2 సిక్స్‌లు) రాణించ‌డంతో.. వెస్టిండీస్ కేవలం 13.1 ఓవర్లలోనే ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. పొలార్డ్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అందుకున్నాడు.

2007 వన్డే ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచులో దక్షిణాఫ్రికా ఆటగాడు హెర్షెల్ గిబ్స్ ఒకే ఓవర్లో ఆరు సిక్సులు బాదాడు. గిబ్స్ ( 72: 40 బంతుల్లో 4 పోర్లు, 7 సిక్స‌ర్లు) విధ్వంసానికి డాన్ వాన్ బంగే బలయ్యాడు. 2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో యువరాజ్ సింగ్ (58: 16 బంతుల్లో 3పోర్లు, 7 సిక్స‌ర్లు) వరుసగా ఆరు సిక్సర్లు కొట్టాడు. అనంతరం ఇప్పుడు కీరన్ పోలార్డ్ ఆరు సిక్సర్లు బాదాడు. టీ20లో ఆరు సిక్సులు బాదిన రెండో బ్యాట్స్‌మన్‌గా, తొలి వెస్టిండీస్ క్రికెటర్‌గా కీరన్ పొలార్డ్‌ అరుదైన ఘనత సాధించాడు.


Next Story
Share it