ఈ ఏడాది కూడా ప్లే ఆఫ్స్ చేరకుండానే ఆర్సీబీ ఐపీఎల్-2023 ప్రయాణం ముగిసిపోయింది. విరాట్ కోహ్లీ విజృంభించి ఆడినా కూడా ప్లే ఆఫ్స్ కు చేరలేకపోయింది ఆర్సీబీ. విరాట్ కోహ్లీ వరుస సెంచరీలతో అలరించినా ఫలితం లేకుండా పోయింది. గుజరాత్ టైటాన్స్‌తో ఆదివారం నాటి ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఆర్సీబీ ఆరు వికెట్ల తేడాతో ఓడిపోవడంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. కోహ్లికి ఐపీఎల్ ఆరంభం నుంచి ఆర్సీబీకే ఆడుతూ వస్తున్నాడు. ఒక్కసారి కూడా ఆర్సీబీ చాంపియన్‌గా నిలవలేకపోయింది. తాజా సీజన్‌లోనూ అదే పునరావృతమైంది.
ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కోహ్లిని ఉద్దేశించి పీటర్సన్ ట్వీట్ చేశాడు. గుజరాత్ చేతిలో ఆర్సీబీ ఓటమి అనంతరం.. ‘‘విరాట్ ఢిల్లీకి మారాల్సిన సమయం ఆసన్నమైంది’’ అంటూ పీటర్సన్ ట్వీట్ చేశాడు. కోహ్లి స్వస్థలం ఢిల్లీకి చెందిన జట్టుకు ఆడాల్సిందిగా సూచన చేశాడు. ఈ ట్వీట్ చూసిన ఆర్సీబీ ఫ్యాన్స్ మాత్రం అసలు ఒప్పుకోవడం లేదు. ఐపీఎల్ ఆడటం మానేసినపుడే కోహ్లి ఆర్సీబీని వీడతాడని చెబుతూ వస్తున్నారు. ఐపీఎల్-2023లో కోహ్లి మొత్తంగా 14 ఇన్నింగ్స్‌లో కలిపి 639 పరుగులు చేశాడు. ఇందులో 6 అర్ధ శతకాలు, రెండు సెంచరీలు ఉన్నాయి. ఆర్సీబీ ఆరో స్థానంతో సీజన్‌ను ముగించింది.