టీ20 ప్రపంచకప్ గెలిచేది వారే
Kevin Pietersen predicts the winner of T20 World Cup 2021 final.ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2021 టోర్నీ తుది
By తోట వంశీ కుమార్ Published on 13 Nov 2021 12:03 PM GMT
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2021 టోర్నీ తుది అంకానికి చేరుకుంది. ఆదివారం దుబాయ్ వేదికగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. డిపెండింగ్ ఛాంఫియన్ వెస్టిండీస్‌తో పాటు టోర్నీలో టైటిల్ ఫేవరెట్‌గా భావించిన టీమ్ఇండియా నాకౌట్ స్టేజీని దాటకుండానే నిష్ర్కమించగా.. గ్రూప్‌లో అగ్రస్థానాల్లో నిలిచి అంచనాలు పెంచిన.. పాకిస్థాన్, ఇంగ్లాండ్ జట్లు సెమీస్‌లో ఓడి ఇంటబాట పట్టాయి. ఇక ఏ మాత్రం అంచనాలు లేకుండా టోర్నిని ఆరంభించిన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు ఫైనల్‌కు చేరి కప్పు కోసం పోరాడనున్నాయి. ఇక ఇద్దరిలో ఎవరు గెలిచినా.. కొత్త ఛాంఫియన్ గా నిలవడం ఖాయం.
ఇదిలా ఉంటే.. ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఖచ్చితంగా కప్ కొడుతుండని ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ అన్నాడు. కివీస్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో బలంగా కనిపిస్తోన్నప్పటికి.. ఆస్ట్రేలియానే కప్పును ముద్దాడుతుందని పీటర్సన్ జోస్యం చెప్పాడు. 2015 వన్డే ప్రపంచకప్‌లో కూడా ఇదే జరిగిందని.. ఆసీస్ ఫైనల్ చేరితే ఓడించడం కష్టమన్నాడు. ఒత్తిడిలో ఆసీస్ ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తారని చెప్పుకొచ్చాడు. ఆదివారం కూడా ఆసీస్ తొలిసారి టీ20 ప్రపంచకప్‌ను గెలుస్తుందన్న ధీమా వ్యక్తం చేశాడు.
ఇక ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఫామ్‌లోకి రావడం కివీస్ కు చాలా ప్రమాదకరమన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో సన్‌రైజర్స్ హైదరాబాద్(ఎస్ఆర్‌హెచ్) తరుపున ఆడిన వార్నర్.. అక్కడ నిరాశపరిచినప్పటికి అక్కడ మరిచిపోయిన ఫామ్‌ను కోపాన్ని ఈ టోర్నీలో చూపిస్తున్నాడన్నాడు. వార్నర్‌కు తోడు సెమీస్‌లో వేడ్, స్టోయినిస్ లు అద్భుతంగా ఆడారని కితాబు ఇచ్చాడు. వీరందరూ మరోసారి విజృంభిస్తే ఆసీస్ టీ20 ప్రపంచకప్ గెలవడం పెద్ద కష్టం కాదని చెప్పాడు.