సెంచరీతో చరిత్ర సృష్టించిన మహ్మద్ అజారుద్దీన్
రంజీ ట్రోఫీ సెమీఫైనల్‌లో గుజరాత్‌పై మహ్మద్ అజారుద్దీన్ సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు.
By Medi Samrat Published on 18 Feb 2025 5:34 PM IST
రంజీ ట్రోఫీ సెమీఫైనల్‌లో గుజరాత్‌పై మహ్మద్ అజారుద్దీన్ సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో అజారుద్దీన్ రెండో రోజు సెంచరీ సాధించి కేరళను పటిష్ట స్థితిలో నిలిపాడు. తద్వారా కేరళ నుంచి రంజీ ట్రోఫీ సెమీ-ఫైనల్‌లో సెంచరీ చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా మహమ్మద్ అజారుద్దీన్ నిలిచాడు. అజారుద్దీన్ 176 బంతుల్లో 13 ఫోర్ల సహాయంతో సెంచరీ పూర్తి చేశాడు. దేశాయ్ వేసిన ఇన్నింగ్స్ 127వ ఓవర్ రెండో బంతికి సింగిల్ తీసి అజారుద్దీన్ సెంచరీ పూర్తి చేశాడు. కేరళను తొలిసారిగా రంజీ ట్రోఫీ ఫైనల్‌కు తీసుకెళ్లేందుకు మహ్మద్ అజారుద్దీన్ శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు.
మహ్మద్ అజారుద్దీన్ క్రీజులోకి వచ్చేసరికి కేరళ జట్టు 157/4 స్కోరు వద్ద కష్టాల్లో ఉంది. ఐదో వికెట్‌కు కెప్టెన్ సచిన్ బేబీ (69)తో కలిసి అజారుద్దీన్ మొదట 49 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దీని తర్వాత మహ్మద్ అజారుద్దీన్ ఒక ఎండ్‌లో నిలదొక్కుకుని సల్మాన్ నిజార్ (52)తో కలిసి ఆరో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యాన్ని పూర్తి చేశాడు. అజారుద్దీన్, నిజార్ ఆరో వికెట్‌కు 149 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. సల్మాన్ నిజార్‌ను ఎల్‌బీడబ్ల్యూ అవుట్ చేయడం ద్వారా విశాల్ జైస్వాల్ ఈ భాగస్వామ్యాన్ని బ్రేక్ చేశాడు.
గుజరాత్ బలమైన బౌలింగ్‌ను మహమ్మద్ అజారుద్దీన్ ధీటుగా ఎదుర్కొంటున్నాడు. ప్రస్తుతం అతనికి అహ్మద్ ఇమ్రాన్ మద్దతుగా నిలిచాడు. గుజరాత్ తరఫున అర్జన్ నాగ్వాస్వాలా అత్యధికంగా రెండు వికెట్లు పడగొట్టాడు. ప్రియజిత్‌సిన్హ్ జడేజా, రవి బిష్ణోయ్, విశాల్ జైస్వాల్ ఒక్కో వికెట్ తీశారు. ప్రస్తుతం కేరళ 163 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 384 పరుగులు చేసింది. మహ్మద్ అజారుద్దీన్ 130*, అహ్మద్ ఇమ్రాన్ 20* పరుగులతో క్రీజులో ఉన్నారు.
నాగ్‌పూర్‌లో ముంబై, విదర్భ మధ్య రంజీ ట్రోఫీ మరొక సెమీ-ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. తొలుత బ్యాటింగ్ చేసిన విదర్భ తొలి ఇన్నింగ్స్ లో 383 పరుగుల స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ముంబై జట్టు 52 ఓవర్లలో 153 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయింది. ముంబై ప్రస్తుతం విదర్భ స్కోరు కంటే 230 పరుగులు వెనుకబడి ఉంది. చేతిలో నాలుగు వికెట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి.