భారత కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు మిల్కీ బ్యూటీ తమన్నాకు కేరళ హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. ఆన్‌లైన్ జూదం నిషేధం కేసుపై ఈ రోజు కేరళ హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా క్రీడా, సినీ ప్రముఖులకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ఆన్‌లైన్ జూదం సంస్థలకు ప్రచారకర్తలుగా ఉన్నారంటూ.. విరాట్ కోహ్లీ, నటి తమన్నా భాటియా, నటుడు అజు వర్ఘీస్‌లకు నోటీసులు పంపించింది. పది రోజుల్లోగా దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కేరళ ప్రభుత్వానికి కూడా కేరళ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
యువత బానిసలుగా మారడంలో బ్రాండ్ అంబాసిడర్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని, ఆన్‌లైన్ రమ్మీని నిషేధించాలని కోరుతూ త్రిసూర్‌కు చెందిన పోలీ వర్గీస్.. హైకోర్టును ఆశ్రయించారు. దీన్ని విచారించిన కోర్టు తాజా నోటీసులు జారీ చేసింది. అలాగే ఈ వ్యవహారంలో వివరణ ఇవ్వాల్సిందిగా రాష్ట్రప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కాగా.. ఈ వివాదంపై ఇటీవలే మద్రాస్ హైకోర్టు సీరియస్ అయిన సంగతి తెలిసిందే. ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్స్ వల్ల ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారనంటూ.. వాటిని ఎందుకు ప్రోత్సహిస్తారని హైకోర్టు ఆగ్రహాం వ్యక్తం చేసింది.