పీటర్సన్ సూపర్‌ క్యాచ్.. బిత్త‌ర‌పోయిన పుజారా.. పంత్ అర్థ‌శ‌త‌కం

Keegan Petersen Takes One Handed Stunner To Dismiss Cheteshwar Pujara.కేప్‌టౌన్ వేదిక‌గా భార‌త్‌తో జ‌రుగుతున్న

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Jan 2022 10:45 AM GMT
పీటర్సన్ సూపర్‌ క్యాచ్.. బిత్త‌ర‌పోయిన పుజారా.. పంత్ అర్థ‌శ‌త‌కం

కేప్‌టౌన్ వేదిక‌గా భార‌త్‌తో జ‌రుగుతున్న మూడో టెస్టులో ద‌క్షిణాఫ్రికా ఆట‌గాడు కీగ‌న్ పీట‌ర్స‌న్ క‌ళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. దీంతో టీమ్ఇండియా న‌యావాల్ పుజారా (9) మ‌రోసారి త‌క్కువ ప‌రుగుల‌కే పెవిలియ‌న్ చేరాడు. వివ‌రాల్లోకి వెళితే.. ఓవ‌ర్‌నైట్ స్కోర్ 57/1 తో మూడో రోజు రెండో ఇన్నింగ్స్‌ ఆట‌ను ఆరంభించిన భార‌త్‌కు ఆదిలోనే గ‌ట్టి షాక్ త‌గిలింది. ఆట ఆరంభ‌మైన తొలి ఓవ‌ర్ రెండో బంతికి ఛ‌తేశ్వ‌ర్ పుజారా ఔట్ అయ్యాడు. మార్కో జాన్స‌న్ వేసిన బంతి అనూహ్యంగా బౌన్స్ అయ్యిది. దీంతో త‌డ‌బాటుకు గురైన పుజారా ఢిపెన్స్ చేసే ప్ర‌య‌త్నం చేయ‌గా.. బంతి పుజారా గ్లోవ్స్‌ను తాకుతూ లెగ్‌సైడ్ వైపు వెళ్లింది. లెగ్‌స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న పీట‌ర్స‌న్ అద్భుత‌మైన డైవ్ చేస్తూ క్యాచ్ అందుకున్నాడు. అచ్చం సూపర్ మ్యాన్‌లానే డైవ్ చేసి ఒంటి చేత్తో బంతిని ఒడిసి పట్టుకున్నాడు. పీట‌ర్స‌న్ క్యాచ్ ప‌ట్టిన విధానానికి స‌హ‌చ‌ర ఆట‌గాళ్లు, ప్రేక్ష‌కులు చ‌ప్ప‌ట్ల‌తో అభినందిచ‌గా.. బిత్త‌ర‌పోవ‌డం పుజారా వంతు అయ్యింది.

పుజారా అనంత‌రం క్రీజులోకి వ‌చ్చిన అజింక్య‌ ర‌హానే(1) మ‌రోసారి నిరాశ ప‌రిచాడు. దీంతో స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో రెండు కీల‌క వికెట్లు కోల్పోయి టీమ్ఇండియా క‌ష్టాల్లో ప‌డింది. దీంతో ఇన్నింగ్స్‌ను చ‌క్క‌దిద్దే బాధ్య‌త‌ను కెప్టెన్ విరాట్ కోహ్లీ(28; 127 బంతుల్లో 4 పోర్లు)తో పాటు రిష‌బ్ పంత్‌(51; 60 బంతుల్లో 4 పోర్లు, 1 సిక్స్‌)త‌మ భుజాల‌పై వేసుకున్నారు. కోహ్లీ ఓ ప‌క్క క్రీజులో పాతుకుపోగా.. రిష‌బ్ పంత్ త‌న‌దైన శైలిలో బౌండ‌రీలతో విరుచుకుప‌డ్డాడు. వ‌న్డే శైలిలో బ్యాటింగ్ చేసిన పంత్ 59 బంతుల్లో అర్థ‌శ‌త‌కాన్ని అందుకున్నాడు. కోహ్లీ, పంత్ సౌతాఫ్రికా బౌల‌ర్ల‌కు ఎలాంటి అవ‌కాశం ఇవ్వ‌లేదు. వీరిద్ద‌రూ మ‌రో వికెట్ ప‌డ‌కుండా తొలి సెష‌న్‌ను ముగించారు. దీంతో టీమ్ఇండియా 130/4 తో లంచ్‌కు వెళ్లింది. ఇప్ప‌టి వ‌ర‌కు పంత్‌, కోహ్లీ జోడి ఐదో వికెట్‌కు అభేధ్యంగా 72 ప‌రుగులు జోడించారు. ప్ర‌స్తుతం టీమ్ఇండియా 143 ప‌రుగుల ఆధిక్యంలో ఉంది.

Next Story