Video : చూడండి.. ఈ సీజ‌న్‌లో ఇది తొమ్మిదోది.. ఆ సైగ సెల‌క్ట‌ర్ల‌కేనా..?

2024-25 రంజీ ట్రోఫీ ఫైనల్‌లో విదర్భ కేరళతో తలపడుతోంది.

By Medi Samrat  Published on  1 March 2025 4:59 PM IST
Video : చూడండి.. ఈ సీజ‌న్‌లో ఇది తొమ్మిదోది.. ఆ సైగ సెల‌క్ట‌ర్ల‌కేనా..?

2024-25 రంజీ ట్రోఫీ ఫైనల్‌లో విదర్భ కేరళతో తలపడుతోంది. నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో విదర్భ బ్యాట్స్‌మెన్ క‌ర‌ణ్ నాయ‌ర్‌ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ కోల్పోయాడు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించాడు. కరుణ్ నాయర్ 184 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. కరుణ్ సెంచరీతో విదర్భ మ్యాచ్‌లో గణనీయమైన ఆధిక్యం సాధించింది.

కరుణ్ తన సెంచరీని వేడుక‌లు ఆక‌ట్టుకునే విధంగా జరుపుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది. కరుణ్ సింగిల్‌తో సెంచరీ పూర్తి చేశాడు. అనంతరం అందరి శుభాకాంక్షలను ఆయన స్వీకరించారు. అతడి ఫస్ట్‌క్లాస్ కెరీర్‌లో ఇది 23వ సెంచరీ కాగా.. ప్రస్తుత దేశవాళీ సీజన్‌లో 9వ సెంచరీ. దీంతో అత‌డు 9 వేళ్లు చూపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతుంది. సెల‌క్ట‌ర్లు ఇప్ప‌టికైనా క‌ళ్లు తెర‌వండి అనే విధంగా నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు.

కరుణ్ తన తప్పిదంతో తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీకి దూరమయ్యాడు. అతడు తొలి ఇన్నింగ్స్‌లో 188 బంతుల్లో 45.74 స్ట్రైక్ రేట్‌తో 86 పరుగులు చేశాడు. అందులో 8 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. సెంచరీ దిశగా దూసుకెళ్తున్న కరుణ్ తప్పిదంతో రనౌట్ అయ్యాడు. ఇదిలావుంటే.. కొంత కాలంగా స్థిరంగా రాణిస్తున్న కరుణ్.. జాతీయ జ‌ట్టులో స్థానం కోసం ఎదురుచూస్తున్నాడు. అయితే ఇటీవ‌ల జ‌రిగిన టోర్నీల‌కు ఎంపిక చేయ‌కుండా సెల‌క్ష‌న్ క‌మిటీ నుంచి అత‌నికి నిరాశే ఎదుర‌య్యింది.

Next Story