లక్నో సూపర్ జెయింట్ కెప్టెన్ కేఎల్ రాహుల్ గాయం కారణంగా సీజన్‌లోని మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. దీంతో కేఎల్ రాహుల్ స్థానాన్ని ఎవరితో భర్తీ చేయనున్నారనే విషయమై తీవ్రమైన చర్చ నడిచింది. లక్నో సూపర్ జెయింట్ కేఎల్ రాహుల్ స్థానాన్ని డాషింగ్ బ్యాట్స్‌మెన్ కరుణ్ నాయర్‌తో భర్తీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని లక్నో సూపర్ జెయింట్స్ తమ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేసింది.
కరుణ్‌ను లక్నో జట్టు 50 లక్షల రూపాయలకు తన క్యాంపులో చేర్చుకుంది. ఐపీఎల్-2023 మినీ వేలంలో కరుణ్ అమ్ముడుపోలేదు. 2016 సంవత్సరంలో కరుణ్ ట్రిపుల్ సెంచరీ చేయడం ద్వారా వార్తల్లో నిలిచాడు. చెన్నై చెపాక్ స్టేడియంలో ఇంగ్లండ్‌పై 381 బంతుల్లో 303 పరుగులు చేశాడు. తద్వారా వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత భారత్ తరఫున ట్రిపుల్ సెంచరీ సాధించిన రెండో బ్యాట్స్‌మెన్‌గా కరుణ్ నిలిచాడు.
లక్నో జట్టులో చేరిన తర్వాత కరుణ్ నాయర్ మాట్లాడుతూ.. "సూపర్ జెయింట్స్‌లో చేరినందుకు నిజంగా సంతోషంగా ఉంది. కేఎల్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. రాహుల్ మరింత బలంగా తిరిగి వస్తాడని ఆశిస్తున్నాను. త్వరలో సహచరులను కలవాలని.. జట్టుకు సహకారం అందించడానికి ఎదురుచూస్తున్నానని అన్నాడు.